సోషల్ మీడియాలో ఇటీవల పెరిగిన చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ గురించి టాలీవుడ్‌లో చలనం వస్తోంది. ఎవరైనా ఈ విషయంలో రియాక్ట్ అవుతారా? సామాజిక బాధ్యత చేపడతారా అని చూస్తుంటే.. ఇద్దరు హీరోలు గొంతెత్తారు. తొలుత సాయితేజ్ (Sai Dharam Tej) మాట్లాడగా, ఆ తర్వాత మంచు మనోజ్, అడివి శేష్ కూడా రియాక్ట్ అయ్యారు. అందులో ఒకరికి తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు కూడా. సోషల్ మీడియాలో చిన్నారులపై నీచమైన ప్రవర్తన, కామెంట్లు చేసేవారి విషయంలో సాయి తేజ్, మంచు మనోజ్ (Manchu Manoj) రియాక్ట్ అయ్యారు.
పిల్లల భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారివురూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ (మాజీ ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. పిల్లలపై అసభ్య కామెంట్స్ చేసిన ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ, నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యం వేస్తోంది అంటూ మనోజ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. హాస్యం ముసుగులో ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరమైందని కూడా అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పిల్లలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలను ఎదుర్కోవడం కోసం ఏడాది క్రితం ఒక వ్యక్తిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాను అని చెప్పిన మనోజ్.. ఇప్పుడు అదే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లలపై నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు అని అన్నారు. పిల్లలు, మహిళల రక్షణకు ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దు అంటూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు మనోజ్ రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులను కోరారు.
ఇదే అంశంపై సాయి తేజ్ కూడా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. మానవ మృగాల నుండి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆలోచించండి. ఎందుకంటే.. సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు అని రాసుకొచ్చారు. కొంతమంది యూట్యూబర్లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలాగే పిల్లలతో కలసి తల్లిదండ్రులు చేసిన వీడియోలపైన జుగుప్సాకరంగా కామెంట్లు చేస్తున్నారని సాయితేజ్ పోస్ట్ పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మంత్రి నారా లోకేశ్ ట్విటర్ ఖాతాలతోపాటు సంబంధిత కార్యాలయాల అకౌంట్‌లను కూడా ట్యాగ్ చేశారు. సాయి తేజ్ ట్వీట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కూడా. తమ ప్రభుత్వ లక్ష్యాల్లో పిల్లల భద్రత ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆ యూట్యూబర్లపై కేసు నమోదు చేశారని సమాచారం.