మహాద్భుతమైన “మహానటి” చిత్రానికి నిన్న ఉదయం నుంచి వస్తున్న స్పందన చూస్తూనే ఉన్నాం. చాలామంది చాలా రకాలుగా “మహానటి” విజయం గురించి, మహానటిగా కీర్తి సురేష్ నటించిన విధానం గురించి, దర్శకుడు నాగఅశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం గురించి ప్రశంసిస్తూనే ఉన్నారు. అయితే.. మన లెక్కల మాస్టారు సుకుమార్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఏకంగా నాగఅశ్విన్ కు ఓ బహిరంగ లేఖ కూడా రాశాడు.
“‘ప్రియ’మైన అశ్విన్, “మహానటి” సినిమా చూసి బయటకి వచ్చిం నీతో మాట్లాడడామణి నీ నంబరుకి ట్రై చేస్తున్నాను.. ఈలోగా ఒక ఆవిడ వచ్చి “నువ్వు డైరెక్టరా బాబు” అని అడిగింది, అవునన్నాను.. అంతే నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. “ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని” అంటూ.. నా కళ్ళల్లో నీళ్ళు, నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను. మనసానా ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో. అంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతిని ఈ సినిమా గురించి” – సుకుమార్ (కొన్ని క్షణాల అశ్విన్)
గమనిక: ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు.. అంటూ ఆనందానుభూతికి లోనయ్యాడు సుకుమార్. ఇప్పటివరకూ నాగఅశ్విన్ కు ఎంతో మంది మెసేజులు, ఫోన్ కాల్స్, ఫేస్ బుక్-ట్విట్టర్ పోస్ట్స్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకొని ఉండొచ్చు, భవిష్యత్ లోనూ జరగచ్చు. కానీ.. సుకుమార్ బహిరంగ లేఖ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది.