సుమారు మూడేళ్ల నుండి అభిమానులను ఊరిస్తూ వచ్చిన కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా ఖరారైంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రమ్-పవన్ మరోసారి కలిసి పనిచేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా మొన్న పూజా కారక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమా విడుదల తేదీ లాక్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం డాలీ తెరకెక్కిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా చిత్రీకణలో ఉన్న పవన్ ఈ సినిమాని వచ్చే నెలలోపు పూర్తి చేయనున్నాడట.
తర్వాత తమిళ దర్శకుడు నేశన్ సినిమాని కాదని మొన్న మొదలెట్టిన త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట పవర్ స్టార్. అంటే జనవరి నుండి పట్టాలెక్కనున్న ఈ సినిమా ఎంత ఆలస్యం అనుకున్న జూన్ నాటికి పూర్తైపోతుంది. జులై లో నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారట. ఆ రోజు మంగళవారం అయినా శెలవు రోజు కలిసొస్తుందని అలా ప్లాన్ చేశారట. గమనిస్తే త్రివిక్రమ్ కి కూడా శుక్రవారం సెంటిమెంట్ పెద్దగా పట్టదు. ఆయన గత రెండు సినిమాలు గురువారం రిలీజ్ కావడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కలతో విడుదల తేదీపై వార్తలు షికారు చేస్తున్నాయి. ఎంతవరకు నిజమవుతోంది చూడాలి..!