ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) , ఆయన సతీమణి సైరా భాను విడాకులు తీసుకుంటున్నారని ఇటీవల వెలువడిన ప్రకటన అన్ని వర్గాల్లో సంచలనంగా మారింది. 29 ఏళ్ల వైవాహిక బంధం తెగిపోయిందనే వార్తకు అభిమానులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రెహమాన్, సైరా భాను ఇద్దరూ తమ నిర్ణయాన్ని వెల్లడించినప్పటికీ, వారిద్దరూ మళ్లీ కలుసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైరా భాను తరఫు లాయర్ వందనా షా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
AR Rahman
పిల్లల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఎవరి దగ్గర ఉండాలన్నది పిల్లలే నిర్ణయిస్తారని ఆమె తెలిపారు. అయితే విడాకుల ప్రక్రియ కొనసాగుతుందా, లేదంటే ఆ ఇద్దరూ సయోధ్య కుదించుకుంటారా అన్న ప్రశ్నపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. వందనా మాట్లాడుతూ, “సయోధ్య పూర్తిగా కుదరదని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రేమ, కుటుంబ బంధాలపై నేను విశ్వాసంతో ఉంటాను.
తుది నిర్ణయం వారి వ్యక్తిగత విషయమే కానీ, వారికి తిరిగి కలిసే అవకాశం ఉండకపోదు అని ఎవరూ చెప్పలేరు” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రెహమాన్, సైరా భాను మళ్లీ ఒకటవుతారనే ఆశలను పెంచుతున్నాయి. అదేవిధంగా, విడాకుల విషయమై భరణా చెల్లింపుల గురించి వచ్చిన వార్తలపై వందనా ఎలాంటి కామెంట్ చేయలేదు. పిల్లల ఆలనా పాలన విషయాన్ని ప్రాథమికంగా పరిగణించాలని ఇరువురూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
రెహమాన్, సైరా భాను మధ్య చాలా ఏళ్ల అనుబంధం ఉందని, అందుకే తిరిగి కలుసుకునే అవకాశం పూర్తిగా ఊహించదగినదేనని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నెటిజన్లు ఈ పరిణామాలను సానుకూలంగా చూస్తున్నారు. ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకుంటే, వారి పిల్లలు కూడా ఆనందంగా ఉంటారనే అభిప్రాయంతో రెహమాన్ దంపతుల మళ్లీ కలయిక కోసం ఆశిస్తున్నారు.