థియేటర్లలో విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఓటీటీలో రావాలి అని ఓ బాండ్ రాసుకుంటారు సినిమా టీమ్ – ఓటీటీ టీమ్. అయితే ఆ బాండ్‌ను కొట్టేసి ముందుగానే సినిమా విడుదల చేసేస్తుంటారు కొంతమంది. ఇటీవల కాలంలో ఇలాంటివి ఒకటి రెండు సినిమాలు చూశాం. ఇప్పుడు వాటి జాబితాలోకి ‘ఆచార్య’ కూడా వచ్చేస్తోందా. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవును ‘ఆచార్య’ ఓటీటీ రాకకు ముహూర్తం కుదిరింది అని చెబుతున్నారు.
చిరంజీవి, కొరటాల శివ, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరంజీవి గత ఫ్లాప్‌ల కంటే ఈ సినిమా ఫలితం ఇంకా ఎక్కువ నిరాశపరిచింది అని అటు అభిమానులు, ఇటు పరిశీలకులు అంటున్నారు. అంతలా సినిమా ఆకట్టుకోలేదు అనేది వారి మాట. అలాంటి సినిమాను అనుకున్న తేదీ కంటే ముందే రిలీజ్ చేసేస్తున్నారట. ‘ఆచార్య’ థియటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి ఇస్తారు అని తొలుత చెప్పారు.
ఆ లెక్కన మే ఆఖరున కానీ, జూన్ మొదటి వారంలో కానీ సినిమా వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే సినిమాను మే 20న ఓటీటీలోకి అదేనండీ అమెజాన్ ప్రైమ్‌లోకి తేవాలని చూస్తోందట చిత్రబృందం. దీనికి సంబంధించి పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న. థియేటర్లలోనే అంత ఘోర పరాజయం పాలైన సినిమాను ఓటీటీలో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. వింటేజ్ చిరంజీవిని చూద్దామని థియేటర్లలోకి వెళ్లిన అభిమానులకు దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి.
అలాగే తండ్రీకొడుకుల్ని ఒకే ఫ్రేమ్‌లో చూసి మురిసిపోదాం అనుకున్నవారికి… ఎందుకొచ్చాంరా బాబూ అనిపించేలా చేసింది అని నెటిజన్లు అంటున్నారు. ముందస్తు బుకింగ్‌ల వల్ల వీకెండ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన.. ‘ఆచార్య’ సోమవారానికి వచ్చేసరికి మరీ ఇబ్బందిపడ్డాడు. సీట్లు ఫిల్ అవ్వని థియేటర్ల బుకింగ్ బ్లాక్స్ స్క్రీన్‌షాట్లతో సోషల్ మీడియా నిండిపోయింది. ఇప్పుడు ఈ సినిమా టీవీలో వస్తే ఇంకెంత రచ్చ జరుగుతుంది అనేది చూడాలి.