మన కడుపు నిండుగా ఉన్నప్పుడు కూడా ఆకలిగా ఉన్న వ్యక్తికి సహాయం చేయాలన్న ఆలోచన రాదు మనకి. అలాంటిది తాను ఆకలిగొన్నప్పుడు కూడా ఎదుటివారి ఆకలిని తీర్చేవాడ్ని ఏమంటాం, ఏమని పొగుడుతాం. అందుకే పూరీ జగన్నాధ్ మహోన్నతమైన మనిషి అయ్యాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. ఆయన హిట్ సినిమా ఆయన మీద అభిమానం పెంచదు, అలాగే ఆయన ఫ్లాప్ సినిమా ఆయన మీద అభిమానాన్ని కాసింత తగ్గించదు. దాసరి నారాయణరావు తర్వాత ఒక దర్శకుడికి స్టార్ డమ్ వచ్చింది అంటే అది పూరీ జగన్నాధ్ కి మాత్రమే. రాజమౌళి లాంటి మహాదర్శకులు కూడా ఫిలిమ్ మేకర్స్ లిస్ట్ లో పూరీ తర్వాతే.
అయితే.. నిన్నటివరకూ పూరీ జగన్నాధ్ మంచి వ్యక్తి, అద్భుతమైన ఫిలిమ్ మేకర్ అని మాత్రమే తెలుసు అందరికీ.. కానీ ఆయన ధాతృత్వం గురించి ఎవరికీ తెలియదు. చేసే 10 వేల రూపాయల సహాయానికే పది లక్షల రూపాయల పబ్లిసిటీ చేసుకొనే రోజుల్లో.. సీనియర్ నటీమణి రామాప్రభకు ప్రతి నెలా 20 వేల రూపాయలు (20,000/-) పంపిస్తూ కూడా ఒక్కసారి కూడా పూరీ ప్రకటించుకోలేదు. స్వయంగా రమాప్రభ చెప్పేవారకూ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. రమాప్రభ పుట్టినరోజు 5వతారీఖున కాబట్టి ప్రతినెలా 5వ తారీఖులోపు ఆమెకు సొమ్ము అందేలా జాగ్రత్త తీసుకొన్నాడట పూరీ జగన్నాధ్. ఈ విషయం తెలిసినప్పట్నుంచి పూరీ మీద అభిమానం రెట్టింపయ్యింది అందరికీ. ఆయన దర్శకుడిగానూ తన తదుపరి చిత్రంతో పూర్వ వైభవం అందుకోవాలని కోరుకొంటున్నారు అందరూ.