‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం మొదలు.. టాలీవుడ్‌లో ఓ విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆ డిస్కషన్‌కు ఆ సినిమాల హీరోలకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అది గురుశిష్యులు (మెంటార్ శిష్యులు) అయిన దర్శకుల గురించే. వాళ్లే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) , హరీశ్ శంకర్(Harish Shankar) . ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) , ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15న బాక్సాఫీసు బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడితే ‘నేనున్నాను కదా.. నేను చెబుతాను కదా’ అని హరీశ్ శంకర్ అంటారనుకుని కొంతమంది ఆగిపోయారు.
అయితే ఎట్టకేలకు ఆయన ఇటీవల స్పందించారు. అలాగే తన కొత్త సినిమా గురించి కూడా చెప్పారు. అయితే ఈ క్రమంలో మరో డౌట్‌కి కారణమయ్యారు. తొలుత తన మెంటార్ పూరి జగన్నాథ్‌తో పోటీ గురించి మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో కొన్ని మన చేతిలో ఉండవు. తప్పనిసరి పరిస్థితిలో వస్తున్నాం. నా సినిమా ఆయనకి పోటీ అని ఎప్పుడూ అనుకోను. రెండు సినిమాలు పెద్ద హిట్టు కావాలి’’ అని క్లారిటీ ఇచ్చేశారు.
ఇక తన కొత్త సినిమా గురించి కూడా హరీశ్ అనౌన్స్ చేశారు. రామ్ నాకు చాలా క్లోజ్. తనతో సినిమా చేస్తున్నాను అని చెప్పేశారు. ‘జవాన్’ (Jawaan) సినిమా నిర్మించిన కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాకు నిర్మాత అని కూడా ప్రకటించారు. దీంతో రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో డౌట్స్ క్లియర్ అయిపోయాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే..
ఈ సినిమా ఇప్పుడు మొదలుపెడితే ఇప్పటికే మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉంటుందా? ఉండదా? రిలీజ్ అవుతుందా? అవ్వదా? అంటే అభిమానులతోనే చెబుతాను అని ఈ మధ్య హరీశ్ అన్నారు. ఆ లెక్కన రామ్ సినిమా అనౌన్స్ చేసి మరోమారు కన్‌ఫ్యూజ్‌కి కారణమయ్యారు హరీశ్. అయితే ఇది ‘ఉస్తాద్..’ తర్వాతనా ముందా అనేది ఆయనే చెప్పాలి.