ఇప్పుడు నారా రోహిత్, నాని లాంటి యువ హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు రవితేజ కూడా ఇంతే. ఏడాదికి సగటున మూడు సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ గా ఎదిగాడు. రవితేజకి విజయానికి మధ్య ఏం జరిగిందో గానీ కొంతకాలంగా అతడిని పులకరించడమే మానేసింది. ఆ మాటకొస్తే.. 2011లో వచ్చిన ‘మిరపకాయ్’ తర్వాత రవిజేత లిస్టులో సరైన హిట్ పడనేలేదు.రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కిక్ 2, సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’ సినిమాలు కూడా రవితేజను హిట్ బాట పట్టించలేకపోయాయి.
ఇక తర్వాత ‘ఎవడో ఒకడు’ సినిమా పూజా కార్యక్రమాలకే పరిమితం అయింది. తర్వాత పలు రీమేక్ లు, రాబిన్ హుడ్ సహా ఒకరిద్దరు కొత్త దర్శకులతో రవితేజ సినిమాలు ఉంటాయని ప్రచారం జరిగినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఎంత కాదనుకున్న ఒక సినిమా సెట్స్ మీదికెళ్లి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కావాలంటే సగటున అయిదారు నెలల సమయం పడుతుంది. ఆ లెక్కన ఈ ఏడు సినిమా రావాలంటే ఈపాటికే చిత్రీకరణ మొదలై ఉండాలి. మొత్తంగా 2016లో రవితేజ సినిమాకి చోటులేకుండాపోయింది. రెమ్యునరేషన్ విషయంలో రవితేజ పట్టుబట్టడం, అతడిలో లుక్ లో తేడా రావటం కూడా దీనికి గల కారణమట. అయితే ‘పవర్’, ‘సర్దార్’ సినిమాల దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ)తో రవితేజ తర్వాతి సినిమా చేయనున్నట్టు వినవస్తుంది. ఈ కథ ఎటు మళ్లుతుందో మరి..!