భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలకు ఇప్పుడు స్వర్ణయుగం అని అంటున్నార పరిశీలకులు. ఎప్పుడూ లేనట్లుగా బాలీవుడ్ సినిమాలు కుదేలవుతుండటం, సౌత్ నుండి వస్తున్న సినిమాలు జాతీయ స్థాయిలో మంచి విజయాలు అందుకోవడం మీకు తెలిసిందే. అయితే సౌత్ సినిమాలు అన్నీ విజయాలు అందుకుంటున్నాయా? అంటే లేదనే చెప్పాలి. ఈ విషయాన్ని ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ప్రస్తావించి వైరల్ అయ్యింది ఆలియా భట్. అలా అని బాలీవుడ్‌ని పొగిడేసిందా అంటే లేదనే చెప్పాలి.
ఆలియా భట్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘డార్లింగ్స్’ అనే సినిమా ప్రచారంలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, సౌత్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఫుల్ క్లారిటీతో మాట్లాడింది. ‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి ఇది క్లిష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌పై కాస్త దయ చూపించాలి. ఈ రోజు ‘ఆహో బాలీవుడ్? ఓహో బాలీవుడ్ అని అనుకోవడం కాదు’ అని చెప్పింది ఆలియా. బాలీవుడ్‌లో ఫ్లాప్‌లు వస్తున్న విషయం కరెక్టే..
అయితే ఇటీవల విడుదలై మంచి విజయాలు సాధించిన హిందీ సినిమాలను పట్టించుకుంటున్నామా అనేది కూడా చూడాలి అంది ఆలియా. దాంతోపాటు సౌత్ సినిమాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది అని అంది. సౌత్‌లో వరుస పాన్ ఇండియా హిట్లు వచ్చిన మాట నిజమే కానీ.. దక్షిణాది నుంచి వచ్చే అన్ని సినిమాలు విజయం అందుకోవడం లేదనే విషయం గుర్తించాలి అని సూచించింది ఆలియా. అక్కడైనా, ఇక్కడైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే విజయం అందుకుంటున్నాయి.
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి కచ్చితంగా వస్తారు అంటూ తన ఆలోచనను చెప్పింది ఆలియా భట్. దీంతో ఆలియా భట్ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఆమె చెప్పిందీ నిజమే. టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల తర్వాత భారీ విజయాలు అందుకున్న తెలుగు సినిమాల సంఖ్య బాగా తక్కువే. కంటెంటే ప్రధానం అనేది చెప్పకనే ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సమయంలో సౌత్ కూడా ‘మేం గ్రేట్’ అనుకోకుండా విజయాలు సాధించాల్సిన టైమ్ వచ్చింది అనొచ్చు.