తన అపురూపమైన చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక దిగ్గజం, అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించి, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని మార్చిన ‘కళాతపస్వి’ కన్నుమూశారు. 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ.. కళలు, కులవ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలపై అద్భుతమైన చిత్రాలు చిత్రీకరించారాయన. విశ్వనాథ్ మృతికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్.ఎమ్.కీరవాణి, బ్రహ్మానందం, జీవిత, రాజ శేఖర్, అల్లు అరవింద్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. అలాగే సీనియర్ నటుడు చంద్రమోహన్ నడవలేని స్థితిలో ఉన్నా సరు.. తనతో ‘సిరి సిరి మువ్వ’ వంటి క్లాసిక్ మూవీతో తన కెరీర్‌ను కీలక మలుపుతిప్పిన ‘కళాతపస్వి’ ని అలా నిర్జీవంగా చూసి భోరున విలపించారు చంద్ర మోహన్. ఆయనను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. మెగాస్టార్ చిరంజీవి సైతం విశ్వనాథ్ పార్థీవదేహాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనది తండ్రీ కొడుకుల బంధంమని చెప్పుకొచ్చారు చిరు.