నాని – ఓటీటీ… ఈ రెండూ అంతగా సరిపడవు అంటుంటారు. గత రెండేళ్లుగా ఈ విషయమ్మీద చర్చ నడుస్తూనే ఉంది. ఓటీటీకి సినిమా అంటేనే నాని భయపడిపోతున్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కారణం నాని నేరుగా ఓటీటీకి ఇచ్చిన రెండు సినిమాలు సరైన విజయం అందుకోకపోవడమే అంటుంటారు. అయితే ఈ విషయంలో నాని స్పందన మరో విధంగా ఉంది. ఓటీటీ భయం పుకార్లు ఏ మాత్రం నిజం కావు అని ఆయన మాటల్లో అర్థమవుతోంది.
నాని నుండి గత రెండేళ్లలో రెండు సినిమాలు వచ్చాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆ రెండు సినిమాలను ఓటీటీలోనే విడుదల చేశారు. నాని డిఫరెంట్ రోల్‌లో నటించిన ‘వి’ 2020లో ఓటీటీలోకి వచ్చింది. పేరున్న హీరో నుండి నేరుగా ఓటీటీకి వచ్చిన తొలి సినిమా ఇదే అని చెప్పొచ్చు. అయితే సినిమాకు సరైన స్పందన రాలేదని రిపోర్టులు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఏడాది ‘టక్ జగదీష్’ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఫర్వాలేదనిపించే స్పందన వచ్చినట్లు సమాచారం.
అయితే నాని మాత్రం రెండు సినిమాలకు మంచి స్పందనే వచ్చిందని చెబుతున్నారు. ‘‘నేనే కాదు.. మా దర్శకులు, నిర్మాతలు, సినిమాని కొన్న ఓటీటీ సంస్థ.. అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు’’ అని చెప్పాడు నాని. రెండు సినిమాలకు వ్యూయర్ షిప్ అద్భుతంగా వచ్చిందని, కొత్త సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయని అమెజాన్ ఓటీటీ వాళ్లు సంతోషం వ్యక్తం చేశారని నాని చెప్పాడు. అందుకే తన తర్వాతి సినిమాలకు రెట్టింపు ఆఫర్ చేయడానికి కూడా ఓటీటీ వాళ్లు సిద్ధమయ్యారని నాని అంటున్నాడు.
ఈ లెక్కన ఈ సినిమాలు సక్సెస్ కాలేదని ఎలా చెప్పగలం అంటూ ప్రశ్నిస్తున్నాడు నాని. నా తొలి ప్రాధాన్యత నిర్మాత సంతోషంగా ఉంచేలా చూడటమే. అందుకోసమే సినిమాలు చేస్తాను. సినిమా కోసం పని చేసే అందరూ హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది. దాంతోపాటు వరుస సినిమాలు చేస్తే… దాని వల్ల చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఆపకూడదు అనుకున్నాను. అందుకే ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమవుతుందని భయపడకుండా ఆ రెండు సినిమాల విషయంలో ముందుకెళ్లిపోయానని చెప్పాడు నాని.