“బాహుబలి” సిరీస్ అనంతరం ప్రపంచస్థాయి పాపులారిటీ సొంతం చేసుకొన్న కీరవాణి ఇకపై డబ్బుకోసం పని చేయను అని డిక్లేర్ చేసేశారు. “ఇప్పటివరకూ డబ్బు కోసం, రిలేషన్స్ కోసం సినిమాలు ఒప్పుకొన్నాను. కానీ.. ఇకపై మాత్రం కేవలం కథ నచ్చితేనే సంగీతాన్ని అందిస్తాను” అంటూ ఒక మినీ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. నిజానికి కీరవాణి “బాహుబలి 2” తర్వాత సంగీత దర్శకత్వానికి నీళ్లొదిలేస్తానన్నారు. అయితే.. కీరవాణి కుటుంబ సభ్యులతోపాటు, ఆయన అభిమానులు కూడా వారించడంతో “కంటిన్యూ చేస్తాను కానీ ఇదివరకట్లా కాక కాస్త సెలక్టడ్ గా వర్క్ చేస్తాను” అని చెప్పాడు.
అయితే.. ఇటీవల ఓ మాస పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ.. “ప్రెజంట్ ట్రెండ్ మ్యూజిక్ లో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సంగీతం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. అందులోనూ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సంగీతం వినే పద్ధతి, ఎంజాయ్ చేసే విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు వినశోంపైన సంగీతం ఎవరూ పెద్దగా వినడం లేదు. ఫాస్ట్ బీట్స్ కి అలవాటు పడిపోయారు. అయితే.. కొన్నాళ్ళకి మళ్ళీ శ్రావ్యమైన సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతుంది” అని చెప్పుకొచ్చారు.