ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. సౌత్ ఇండియాలో అతి చిన్న ఇండస్ట్రీ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సినిమా ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్2’ భారీ విజయాన్ని అందుకుంది. అత్యధిక వసూళ్లతో.. కన్నడ సినిమా స్థాయిని పెంచేసింది.
‘కేజీఎఫ్’ సినిమాకి వచ్చిన క్రేజ్ చూసి దీన్ని ఫ్రాంచైజీగా మార్చాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ‘కేజీఎఫ్2’ రిలీజైనప్పుడే ‘కేజీఎఫ్3’ గురించి హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ పార్ట్3తో ఆగిపోదని అన్నారు. ముందుగా ‘కేజీఎఫ్3’ సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ సినిమా 2025లో సెట్స్ మీదకి వెళ్తుందని..2026లో ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ నిర్మాత వెల్లడించారు.
‘కేజీఎఫ్4’, ‘కేజీఎఫ్5’ సినిమాలు కూడా వస్తాయని చెప్పిన ఆయన.. ఈ ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో వేరే హీరోలు కూడా నటించే అవకాశం ఉందని అన్నారు. జేమ్స్ బాండ్ తరహాలో రాకీ క్యారెక్టర్ ను మారుస్తామని అన్నారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో వేర్వేరు హీరోలు నటించినట్లు.. ఈ ఫ్రాంచైజీలో కూడా వేరే హీరోలు నటిస్తారని చెప్పారు. అయితే రాకీ పాత్రలో మరొక హీరోని ఊహించుకోవడమంటే కష్టమే. అదనంగా మరో హీరోని పెట్టడం ఓకే కానీ..
హీరో యష్ స్థానంలో మరో హీరో వస్తే మాత్రం ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. ఇక ‘కేజీఎఫ్3’ విషయానికొస్తే కథ మొత్తం అమెరికా నేపథ్యంలో సాగుతుందని సమాచారం.