తెలుగు చక్రవర్తి శాతకర్ణి కథతో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈసినిమాలో శ్రేయ, హేమ మాలిని కీలక పాత్రల్లో కనపడనున్నారు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటెర్టైమెంట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ సినిమా 2017 సంక్రాంతికి తెరపైకి రానుంది.చారిత్రాత్మక కథతో రూపొందుతోన్న ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు సగటు సినీ అభిమానిలోను అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు తల్లిపేరుతో కలుపుతూ వేయడం అందరిలో ఆసక్తిరేపింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులైతే ఆయన ఇంటిపేరు ‘నందమూరి’ అన్నది మచ్చుకైనా కనపడలేదని అచ్చెరువొందారు.
దీనిపై క్రిష్ స్పందిస్తూ “అప్పటి కాలం పితృ స్వామ్యం వ్యవస్థతో కూడినదని, వ్యక్తుల పేర్లకు ముందు వారి తండ్రి పేరు ఉండాలన్నది కఠినమైన నియమమని చెప్పుకొచ్చిన ఆయన మొట్ట మొదటిగా శాతకర్ణి తన తల్లి పేరైన ‘గౌతమి’ని తన పేరుకు ముందు చేర్చడంతో గౌతమీపుత్ర శాతకర్ణిగా పిలవబడ్డారని అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ నియమాన్ని అనుసరిస్తూ బాలయ్య పేరును ‘బసవరామతారకపుత్ర బాలకృష్ణ’ తనపేరునూ ‘అంజనపుత్ర క్రిష్’ అని వేయడం జరిగిందన్నారు. ఈ సినిమాకి సంబందించినంత వరకు అందరి పేర్లు తల్లిపేరుతో కలిసే ఉంటాయని క్రిష్ స్పష్టం చేశారు. ఒక కొడుకు తండ్రికన్నా గొప్పవాడు కాగలడు కానీ, తల్లి కన్నా గొప్పవాడు కాలేడని తల్లి గొప్పతనాన్ని చెప్పారు క్రిష్.