క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీయడంలో కానీ, ‘ఖడ్గం’ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో కానీ ఆయన సిద్ధహస్తుడు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన హిట్లు కొట్టలేకపోతున్నాడు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఆయన సినిమాలు చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు ఇప్పుడు చూస్తే చాలా అడ్వాన్స్డ్ గా తీశారు అనిపిస్తుంది. కానీ మొన్నామధ్య కృష్ణవంశీ తీసిన ‘శశిరేఖా పరిణయం’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘నక్షత్రం’ వంటి సినిమాలు చూస్తే..
కృష్ణవంశీ ఇంత రొటీన్ గా ఆలోచిస్తున్నారు ఏంటి? అని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. చాలా చాలా గ్యాప్ తర్వాత ఆయన ‘రంగమార్తాండ’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది మరాఠీ లో నానా పాటేకర్ నటించిన ‘నట సామ్రాట్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ కెరీర్ లో ‘చంద్రలేఖ’ తర్వాత తప్ప ఆయన రీమేక్ ల జోలికి పోలేదు.ఇన్నాళ్టికి ‘నట సామ్రాట్’ ను రీమేక్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజే డైరెక్ట్ చేయాలి అనుకున్నారట. కథ, స్క్రీన్ ప్లే కోసం కృష్ణవంశీ సాయం అడిగారట. కానీ ఆయనే డైరెక్ట్ చేస్తూ నటించాలి అంటే ఔట్పుట్ కరెక్ట్ గా రాదు అని చెప్పి కృష్ణవంశీనే డైరెక్ట్ చేయమని చెప్పారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. ప్రకాష్ రాజ్ కోసం ‘నట సామ్రాట్’ సినిమా చూసినప్పుడు ఆయన 5 సార్లు ఏడ్చినట్టు కూడా చెప్పుకొచ్చాడు.