ఫ్లాప్ సినిమాను ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరక్టర్ అయినా, నిర్మాత అయినా, ఆఖరికి ఫ్యాన్ అయినా. టాలీవుడ్‌లో ఇలాంటి ధైర్యం ఉన్న వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి అతి కొద్దిమందిలో దర్శకుడు కృష్ణ వంశీ ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని కచ్చితంగా చెప్పుకుంటారు. సోకాల్డ్ సినిమా జనాలు లాగా ఇంకా మా సినిమా హిట్టే, డబ్బులు వచ్చేశాయి చూరుకు పట్టుకుని వేలాడే రకం కాదు. అదెందుకో మరోసారి తెలిసింది.
‘గులాబి’ సినిమాలో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు కృష్ణ వంశీ. ఆ తర్వాత వరుసగా క్రియేటివ్ సినిమాలు కెరీర్‌ను పరుగులు పెట్టించారు. అయితే గత కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన మేర తన క్రియేటివిటీ చూపించలేదు. దీంతో దారుణ పరాజయాలు పాలయ్యాయి. ఇప్పుడు ‘రంగ మార్తాండ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రచారం మొదలుపెట్టారు. త్వరలో సినిమా విడుదల చేస్తారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నారు కృష్ణ వంశీ. అందులో భాగంగానే తన పాత సినిమాల గురించి మాట్లాడారు.
కృష్ణవంశీ తెలిసినవాళ్లు చెప్పేమాట ఏంటంటే… ఎప్పుడూ తన గురించి గొప్పలకు పోరు అని. తన సినిమాల గొప్పదనం గురించి ఊదరగొట్టడం లాంటివి ఎప్పుడూ చూడలేదట. సరిగా ఆడని సినిమాలు కూడా సూపర్ అని డప్పుకొట్టరు. తన ఫ్లాప్ సినిమాల గురించి, లోపాల గురించి ఆయన నిజాయితీగానే మాట్లాడతాడు అంటారు. చాలా ఏళ్ల నుండి సరైన సినిమాలు తీయకపోవడం వల్ల తన మార్కెట్ దెబ్బ తినిందని, నిర్మాతలు తనతో సినిమా చేయడానికి భయపడే పరిస్థితి వచ్చిందని నిజాయితీగా అంగీకరించారు కృష్ణ వంశీ.
సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైశ్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘నక్షత్రం’. ఈ సినిమా డిజాస్టర్ అయిందని, దానికి ముందు నానితో చేసిన ‘పైసా’ కూడా డిజాస్టరే అని, అలాగే రామ్ చరణ్‌తో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ పరిస్థితి కూడా అంతంతే అయ్యిందని చెప్పారు కృష్ణ వంశీ. ఇలా తన రీసెంట్ రికార్డు బాగోలేకపోవడం వల్ల నిర్మాతలు తనతో పని చేయడంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నిర్మాత లేక ఇబ్బంది పడే పరిస్థితిని తాను ఎదుర్కొన్న మాట వాస్తవమే అని కృష్ణ వంశీ అన్నారు.