టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరక్టర్ అనే పదం… కృష్ణవంశీ నుండే ప్రారంభమైందని చెప్పొచ్చు. సినిమా, సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ తనదైన దూసుకుపోయే దర్శకుడాయన. అయితే గత 12 ఏళ్లుగా ఆయనకు సరైన హిట్ లేదు. ‘మహాత్మ’ తర్వాత ఆయన నుండి అంత ఇంపాక్ట్ చూపించిన సినిమా లేదు. ‘పైసా’ వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2017లో ‘నక్షత్రం’తో వచ్చిన ఆయన… లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ‘రంగమార్తాండ’చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి… అని ఎవరూ అడగకుండానే చెప్పేశారు.
మహాశివరాత్రి సందర్భంగా కృష్ణ వంశీ తన కొత్త సినిమా ప్రకటించారు. సినిమా పేరు ‘అన్నం’. ఏముంది మరో రైతులు, వ్యవసాయం నేపథ్యంలోనే సినిమా అనుకునేరు. ఆ పోస్టర్ చూస్తే… అసలు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అందులో కాన్సెప్ట్ మొత్తం చెప్పే ప్రయత్నం చేశారు కృష్ణవంశీ. డీటైల్డ్‌గా చూస్తే… అది అన్నం కాదు… రక్తం నిండిన అన్నం. అవును పైన ఫొటోలో చూడండి… అరటాకులో అన్నం చుట్టూరా రక్తమే ఉంది. ఇంకా ఓ గొడ్డలి, తెగిన పుస్తెలు కనిపిస్తున్నాయి. అన్నం అనే టైటిల్‌లోనూ రక్తం ఉంది.
ఇంకా ఆ పోస్టర్ చూస్తే… నల్ల ధనం, ఉచిత పథకాలు, ప్రభుత్వాలు, మందులు, సాగు నీటి పారుదల, రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఉద్యోగులు, కబ్జా, ఆత్మహత్య, లంచం, రాజకీయం… ఇలా చాలా పేర్లు కనిపిస్తున్నాయి. ఇవి అన్నీ ప్రజల నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాలే. వీటి ప్రకారం చూస్తే… ప్రస్తుతం ప్రజల కష్టాలు, బాధలు, కన్నీళ్ల నేపథ్యంలో రాసుకున్న కథలా కనిపిస్తోంది. టైటిల్ కింద పరబ్రహ్మ స్వరూపం అని ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయట. ఈ సినిమాను ఓ విస్పోటం అంటున్నారు కృష్ణవంశీ. చూద్దాం ఏమవుతుందో?