సినిమా వాసులకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ఫిలిం ఫెస్టివల్‌లో పురస్కారానికి మించింది లేదు అంటుంటారు. దీని కోసం ఫుల్ లెంగ్త్ సినిమాలు ఎంతగా కష్డపడతాయో, షార్ట్ ఫిలింస్ కూడా అంతే స్థాయిలో కష్డపడుతుంటాయి. అలా త్వరలో ఆస్కార్ పోటీకి తెలుగు షార్ట్ ఫిలం ఒకటి సిద్ధమవుతోంది. దాని పేరు ‘మనసానమః’. గతేడాది యూట్యూబ్‌లో స్ట్రీమ్ అయిన ఈ లఘు చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ప్రశంసలు, పురస్కారలు దక్కించుకుంది. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో దీపక్ రెడ్డి ‘మనసానమః’ తెరకెక్కించారు.
ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ షార్ట్ ఫిలం ఇప్పటివరకు వివిధ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించింది. ఇప్పుడు ఆస్కార్ పురస్కారం రేసులో నిలవడానికి సిద్ధమవుతోంది. దీని కోసం క్వాలిఫైలో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు 10న ఓటింగ్ జరగబోతుంది. అందులో విజయం సాధిస్తే ఆస్కార్ బరిలో నిలిచినట్లే. రివర్స్ స్క్రీన్‌ప్లేతో ఈ ప్రేమ కథను రూపొందించారు.
దాంతోపాటు మ్యూజిక్‌కు ప్రాధాన్యమిచ్చారు. కథ మొత్తాన్ని రివర్స్‌లో తీయడంతో ప్రేక్షకులకు మంచి అనుభూతి దక్కుతోంది. మరి ఆస్కార్ ఓటింగ్‌లో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది త్వరలో తేలిపోతుంది. ఈ నెల 10న జరగబోయే ఓటింగ్‌లో పక్కాగా విజయం సాధిస్తామని చిత్రబృందం ఆశిస్తోంది. ఏమవుతుందో చూడాలి.