టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు సక్సెస్ కోసం పరితపిస్తున్న. ‘ఛలో’ లాంటి సినిమా తరువాత శౌర్య కెరీర్ దూసుకుపోతుందనుకుంటే.. ఆ స్థాయి హిట్ పడక ఇబ్బంది పడుతున్నారు. ‘ఛలో’ తరువాత శౌర్య చేసిన ‘కణం’, ‘అమ్మమ్మగారిల్లు’, ‘నర్తనశాల’ ఇలా ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. మధ్యలో ‘ఓ బేబీ’ హిట్ అయినా.. ఆ క్రెడిట్ శౌర్యకి రాలేదు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని చేసిన ‘వరుడు కావలెను’ సినిమా ఏవరేజ్ గా ఆడింది. ‘లక్ష్య’ సినిమా కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఎంత కష్టపడినా.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ సినిమాల ప్లాప్ దెబ్బకి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసిన ‘కృష్ణ వ్రింద విహారి’ పలు సార్లు వాయిదా పడుతూ.. ఫైనల్ గా ఈ నెల 23న విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇందులో నాగశౌర్య సంప్రదాయాలకు విలువిచ్చి.. పాటించే బ్రాహ్మణ యువకుడిగా కనిపించారు. ఇలాంటి క్యారెక్టర్ ని మొన్నామధ్య ‘అంటే సుందరానికి’ సినిమాలో నాని పోషించారు. క్యారెక్టరైజేషన్ లో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. నాని ఆ పాత్రను ఎంత బాగా పోషించినా.. సినిమాకి మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు. కానీ శౌర్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ కాస్త గట్టిగానే ఉందనిపిస్తుంది.
ట్రైలర్ మాదిరి సినిమా కూడా ఉంటే ఈసారి శౌర్య హిట్టు కొట్టడం గ్యారెంటీ. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. కాలేజీ టూర్ లు అలానే పాదయాత్ర చేయబోతున్నారు. తిరుపతి నుంచి విశాఖ వరకు ఈ యాత్ర సాగుతుంది. వాహనాల్లో ఊళ్లోకి రాగానే కిందకు దిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. కాలేజీ లేదా ఏదో ఒక వెన్యూ వరకు జనాలతో ఇంట్రాక్ట్ అవుతూ ఈ పాదయాత్ర నిర్వహిస్తారు. మరి దీనికి పర్మిషన్లు దొరుకుతాయో లేదో చూడాలి!