సినీ పరిశ్రమను వరుస విషాదాలు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. మే నెలలో ఆల్రెడీ.. వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్,ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు ,బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా, సీనియర్ నటుడు శరత్ బాబు,బెంగాలీ నటి సుచంద్ర దాస్‌గుప్తా,ఆర్.ఆర్.ఆర్ నటుడు స్టీవెన్ సన్ ,బుల్లితెర నటి వైభవి వంటి వారు మరణించారు. ఈ మరణవార్తలతోనే సినీ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో చేదు వార్త అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. దర్శకుడు కె.వాసు ఈరోజు మరణించారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కె.వాసు.. సీనియర్ మోస్ట్ డైరెక్టర్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. ఈరోజు హైదరాబాద్..లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. రేపు ఉదయం 6 గంటలకు ఫిలింనగర్లో ఉన్న ఆయన నివాసానికి.. వాసు భౌతిక కాయాన్ని తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.
ఇక దర్శకుడు.. కె.వాసు చిరంజీవి నటించిన మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ ని డైరెక్ట్ చేశారు. తర్వాత ‘కోతల రాయుడు’ ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ ‘ఆడ పిల్ల’ ‘పక్కింటి అమ్మాయి’ ‘అల్లుళ్ళు వస్తున్నారు’ ‘తోడు దొంగలు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.