2022 సంవత్సరంలో కొన్నిరోజుల గ్యాప్ లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదల కానున్నాయి. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ రాజమౌళి కృషితో భీమ్లా నాయక్ వాయిదా పడింది. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతృప్తిగా లేరు. సాధారణంగా ఫిబ్రవరి నెల పెద్ద సినిమాలకు అనుకూలం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఉప్పెన సినిమా విడుదలై ఘన విజయం సాధించినా
ఫిబ్రవరిలో విడుదలైన ఎక్కువ సినిమాలు భారీ మొత్తంలో కలెక్షన్లను సాధించడంలో ఫెయిలయ్యాయి. కొన్నేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నటించి విడుదలైన టెంపర్ ఫిబ్రవరి నెలలో విడుదల కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఫిబ్రవరి నెల పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సినిమాలపై ఆసక్తి చూపరు. మరోవైపు ఫిబ్రవరి నెలలో ఒమిక్రాన్ కేసులు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫిబ్రవరిలో కొన్ని లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పవన్ ఫ్యాన్స్ ఒమిక్రాన్ గురించి వస్తున్న వార్తల వల్ల తెగ టెన్షన్ పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. భీమ్లా నాయక్ వాయిదా పడితే సర్కారు వారి పాట కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.
అయితే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫిబ్రవరికే పరిమితం కావడంతో సర్కారు వారి పాటపై రిలీజ్ డేట్ ప్రభావం పడే అవకాశం లేదు. సర్కారు వారి పాట షూటింగ్ కొంత భాగం పెండింగ్ లో ఉందని సమాచారం. 2022 సంవత్సరం జనవరి నెల నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది వరుసగా భారీ సినిమాలు రిలీజవుతూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.