మాస్ మహారాజ్ రవితేజ ఉత్సాహమే వేరు. ఈ వయసులోనూ ఆయన యువ హీరోలతో పోటీగా చకచకా సినిమాలు చేస్తున్నారు. మూడు నెలల తేడాలో రెండు సినిమాలు రిలీజ్ చేయించిన అతను ప్రస్తుతం కల్యాణ కృష్ణ దర్శకత్వంలో “నేలటికెట్” సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మే లో రిలీజ్ కానుంది. దీనిని కంప్లీట్ చేయకముందే మరో సినిమాకి ఒకే చెప్పారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. “అమర్ అక్బర్ ఆంటోనీ” పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే మరో కథకి రవితేజ సై అన్నారు.
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ రీసెంట్ గా అల్లు శిరీష్ తో “ఒక్క క్షణం” తీసి విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. అతను చెప్పిన కథ నచ్చడంతో మాస్ మహారాజ్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని చెప్పినట్టు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. ప్రస్తుతం రవితేజ “నేలటికెట్” సినిమాని నిర్మిస్తున్న నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.