టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సామాజిక కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రత్యుషా ఫౌండేషన్ పేరుతో ఎందరో అనాథలకు సహాయం చేస్తోంది. కష్టాల్లో ఉన్నవారిని ఆడుకుంటూ తన మంచితనం చాటుకుంటుంది. తాజాగా సమంత చేసిన ఓ పనికి నెటిజన్లు ఆమెని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు నటి సమంత నుండి ఊహించని బహుమతి లభించింది. ఓ షోరూమ్ నుండి కవితకు ఫోన్ రాగా.. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.
షోరూమ్ వాళ్లు చెప్పినట్లుగా.. ఆమె బంజారాహిల్స్ మారుతి షోరూమ్ కి వెళ్లింది. అక్కడి నిర్వాహకులు ఆమెకి రూ.12.50 లక్షల విలువైన స్విఫ్ట్ డిజైర్ కారుని అందజేశారు. ఆరు నెలల కృత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవిత పాల్గొంది. ఈమె జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు.. యూట్యూబ్ లో ఆమె స్టోరీ పోస్ట్ చేశారు. అది చూసిన సమంత తనవంతు సాయంగా ఇలా కారుని బహుమతిగా అందించారని.. కవిత సంబరపడుతోంది.
డోవూర్ చందర్ నాయక్ తండాకు చెందిన కవితకు చిన్నప్పుడే పెళ్లి చేసేశారు. ఆమె భర్త రోజూ తాగొచ్చి తనకు హింసించేవాడు. అతడి వేధింపులు భరించలేని కవిత తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ పొలం పనులు చూసుకుంటూ తన ఏడుగురు చెల్లెళ్లను పెంచింది. తల్లిదండ్రులు మరణించడంతో.. కుటుంబపోషణ మొత్తం కవిత చూసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె ఆటో డ్రైవింగ్ నేర్చుకొని హైదరాబాద్ కు వచ్చింది. ఆటో నడుపుకుంటూ ఫ్యామిలీను పోషిస్తోంది.