టాలీవుడ్ లో ‘సింహరాశి’, ‘శివరామరాజు’, ‘మహానంది’, ‘ఎవడైతే నాకేంటి’ ఇలా పలు సినిమాలను డైరెక్ట్ చేశారు సముద్ర. ఆయన డైరెక్ట్ చేసిన ‘సింహరాశి’, ‘ఎవడైతే నాకేంటి’ సినిమాల్లో రాజశేఖర్ హీరోగా నటించారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. డైరెక్టర్ గా సముద్ర కెరీర్ మొదలుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్ గురించి, ఆయన ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి వెల్లడించారు.
హీరో రాజశేఖర్, ఆయన సతీమణి సీనియర్ నటి జీవితలతో తనకొచ్చిన గొడవ గురించి మాట్లాడారు. తన కెరీర్ లో పొరపచ్చాలు అంటే రాజశేఖర్ తోనే వచ్చిందని.. ఆయన, జీవిత కలిసి తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు సముద్ర. ”నేను ఆయనతో ‘ఎవడైతే నాకేంటి’ సినిమాను డైరెక్ట్ చేశాను. అంతకుముందు ఆయనతో చేసిన ‘సింహ రాశి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత రాజశేఖర్‌కు హిట్స్ లేవు. మధ్యలో కొన్ని సినిమాలను డైరెక్ట్ చేయమని నన్ను అడిగారు.
ఆ కథలు నాకు నచ్చకపోవడంతో చేయనని చెప్పాను. కానీ రాజశేఖర్ తనతో నేను సినిమా చేయడం ఇష్టం లేక వద్దంటున్నానని అనుకునేవారు. తర్వాత ‘ఎవడైతే నాకేంటి’ సినిమా కథ విన్నాను. అది నచ్చడంతో సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. ఆ ఆసమయంలో జీవిత, రాజశేఖర్ డైరెక్టర్‌గా నా పేరు తీసేసి.. వాళ్ల పేర్లు వేసుకోవాలని అనుకున్నారు.
దాంతో స్పాట్‌లో నన్ను ఇరిటేట్ చేయడం.. తక్కువ చేసి మాట్లాడటం చేశారు. దీంతో సినిమా నుంచి తప్పుకున్నాను. నేను వెళ్లిపోయిన తరువాత వాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. సినిమా మీరే చేయాలని ఇద్దరూ అడగడంతో ఒప్పుకున్నాను. చివరకు నా పేరు కింద వాళ్ల పేర్లు వేసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.