సంక్రాంతి సినిమాల రిలీజ్ కి చాలా రోజుల ముందు నుంచే థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద వివాదం నడిచింది. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి రెండు పెద్ద సినిమాలు ఉండగా.. వాటికి ధీటుగా డబ్బింగ్ సినిమా అయిన ‘వారసుడు’కి దిల్ రాజు థియేటర్లు కేటాయించడంపై చాలా రోజుల పాటు చర్చ నడిచింది. ఫైనల్ గా ఏం జరిగిందో ఏమో కానీ తన సినిమాను ముందు అనుకున్న ప్రకారం జనవరి 11న రిలీజ్ చేయకుండా.. మూడు రోజులు ఆలస్యంగా 14న రిలీజ్ చేశారు.
ఇలా చేయడానికి కారణం.. తెలుగు సినిమాల మీద ఉన్న ప్రేమే అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. మూడు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయడం ఓకే కానీ.. 14న ‘వారసుడు’ విడుదల సమయానికి మాత్రం దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ముందు అనుకున్నట్లే ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు ధీటుగా తన ‘వారసుడు’ సినిమాకి థియేటర్లు, షోలు ఇప్పించుకున్నారు. నిజానికి ఈ సినిమాకి తెలుగులో పాజిటివ్ టాక్ రాలేదు. కానీ సంక్రాంతి సినిమాలంటే జనాలు ఎలా ఉన్నా చూస్తారు.
‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల ఓవర్ ఫ్లో.. ‘వారసుడు’కి కలిసొచ్చింది. పైగా పేరున్న థియేటర్లలో ‘వారసుడు’ ఆడుతుండడం కూడా సినిమాకి ప్లస్ అయింది. దాని వలన తొలి మూడు రోజుల్లో ‘వారసుడు’ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే సోమవారం తరువాత నుంచి మాత్రం సినిమా స్లో అయింది. చిరు ‘వాల్తేర్ వీరయ్య’ మాత్రం దూకుడు కొనసాగిస్తోంది. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ మోస్తరుగా ఆడుతోంది. కానీ స్క్రీన్లు, షోల విషయంలో ‘వాల్తేర్ వీరయ్య’ తరువాత ‘వారసుడు’ సినిమా రెండో స్థానంలో ఉండడం ఆశ్చర్యంగా ఉంది.
హైదరాబాద్ లాంటి సిటీల్లో బాలయ్య సినిమాను మించి విజయ్ ‘వారసుడు’కి ఎక్కువ షోలు కేటాయించడం ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా 400 షోలు పడగా.. ‘వారసుడు’కి 300కి పైగా షోలు పడుతున్నాయి. బాలయ్య సినిమా కేవలం 270 షోలు మాత్రమే పడడం నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.