వెబ్‌సిరీస్ అభిమానులను ఇప్పుడు కదిలిస్తే… వచ్చే టాపిక్ ‘స్క్విడ్ గేమ్’. అంతలా ఆకట్టుకుంటోంది ఈ వెబ్‌సిరీస్. కొత్త కథలను ఆదరించే భారతీయ ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగు యువ ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను తెగ చూస్తున్నారు. అయితే ఈ సిరీస్‌లో చూపించిన కాన్సెప్ట్ అదే… ఆ గేమింగ్ కాన్సెప్ట్ భారతీయ వెండితెర మీద ఇప్పటికే వచ్చింది. అది కూడా 12 ఏళ్ల క్రితమే అంటే నమ్మగలరా. ‘స్క్విడ్‌గేమ్’ విడుదలైనప్పటి నుంచి…
ఈ సిరీస్‌ను ‘ది గాడ్స్ విల్’ అనే జపాన్ సినిమా నుండి కాపీ కొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే 2009 లోనే ఈ కథను రాసుకున్నట్లు రచయిత చెప్పుకొచ్చారు. అయితే అదే ఏడాది బాలీవుడ్‌లో ఇమ్రాన్ ఖాన్, శ్రుతి హాసన్, సంజయ్‌దత్ ప్రధానపాత్రల్లో ‘లక్’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ‘స్క్విడ్ గేమ్’ తరహాలోనే ఉంటుంది. కావాలంటే ఓ సారి సినిమా చూడండి మీకే తెలుస్తుంది.
‘లక్’లోనూ జీవితం బోరింగ్‌గా అనిపించి కొందరు బిలియనీర్లు ఇలాంటి ప్రాణాంతక పోటీలనే నిర్వహిస్తారు. అప్పులపాలైన కొందరు ఈ నెత్తుటి పోటీల్లో పాల్గొంటారు. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అప్పటి ట్రెండ్‌కి ఈ కాన్సెప్ట్ నచ్చలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా చూస్తే… మనవాళ్లు ముందే ఊహించేశారే అనిపిస్తుంది. అన్నట్లు ‘లక్’ శ్రుతి హాసన్ మొదటి సినిమా.