సినిమా కాంబినేషన్ సెట్ అయ్యిందని గురించి పుకారు వచ్చినప్పుడో, సినిమా ముహూర్తం జరిగినప్పుడో లేక అనౌన్స్‌మెంట్ అయినప్పుడో ఆ సినిమా మొదలైది అని అనుకుంటాం. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా ఏళ్ల ముందు నుండే పనులు జరుగుతుంటాయి. కొన్ని అక్కడ ఆగిపోతే.. ఇంకొన్ని అన్నీ అనుకున్నట్లుగా జరిగి మొదలవుతాయి, పూర్తవుతాయి, థియేటర్లలోకి వస్తాయి. అలా చాలా ఏళ్ల శ్రమ తర్వాత మొదలైన ఇప్పుడు విడుదలవుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.
అవును, ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఇప్పుడు అంటే 2023లో వస్తున్నాడు కానీ… ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగింది ఆరేళ్ల క్రితం. 2017లో రవితేజకు ఈ కథ చెప్పాలని ప్రయత్నించారట దర్శకుడు వంశీ. అయితే అప్పుడు రవితేజ బిజీగా ఉండటంతో వీలుపడలేదట. దీంతో ఒకరిద్దరు వేరే హీరోలకు కథ వినిపించారట. కానీ, ఈ కథ రవితేజకు అయితేనే బాగుంటుంది అని అనిపించి వెనక్కి వచ్చేశారట. అలా కొవిడ్ సమయంలో కథ వినిపించారట.
అయితే సినిమా కథ ఫస్ట్ హాఫ్ విన్నాక ‘షూటింగ్ ఉంది. మిగతాది రేపు వింటాను’ అని రవితేజ అన్నారట. దీంతో ఇక మళ్లీ ఫోన్ రాదేమో అనుకున్నారట వంశీ. కానీ మరుసటి రోజు పిలిచి పూర్తి కథ విన్నాడట రవితేజ. క్లైమాక్స్ చెబుతుండగానే పాత్ర ఎలా ఉండాలి, మేకప్ ఎలా ఉండాలి అని రవితేజ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడట. అలా ఈ కథకు రవితేజ నుండి ఆమోదముద్ర వచ్చింది అని చెప్పారు వంశీ.
సినిమాలో రాజమహేంద్ర వరం బ్రిడ్జిపై వచ్చే ట్రైన్ సీక్వెన్స్ అదిరిపోతుందని వంశీ చెప్పారు. గోదావరి బ్రిడ్జ్‌ను రీక్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడ్డామని… కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. ఆ సీక్వెన్స్ తీయడానికి 20 రోజులు పట్టిందని, ఆ గ్రాఫిక్స్ వర్క్ చేయడానికి ఏడాది పట్టింది అంటూ ఆ సీన్ మీద ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు వంశీ. ఎలా ఉందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగితేసరి.