‘ఉప్పెన’ సినిమా విడుదలవుతున్న సమయంలో ట్విటర్‌లో ‘వైష్ణవ్ తేజ్’ పేరుతో ఓ అకౌంట్ కనిపించింది. టైమ్లీ ట్వీట్లు కనిపించేవి. సినిమా గురించి అప్‌డేట్లు ఉండేవి. అయితే ఆ అకౌంట్ వెరిఫైడ్ కాదు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వెరిఫైడ్ ఉంది. వైష్ణవ్ తేజ్ అకౌంట్.. వెరిఫైడ్ కాకపోవడమా అని అనుమానపడుతూనే ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ఇది ఒరిజినల్ అకౌంట్ కాదని.. చాలామంది దిగువ కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి వైష్ణవ్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మరోసారి చెప్పాడు.
తన పేరుతో ఉన్న ట్విటర్ అకౌంట్‌ను ఎవరూ ఫాలో కావొద్దని నెటిజన్లకు సూచించాడు వైష్ణవ్ తేజ్. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశాడు. ‘నేను ట్విటర్‌లో లేను. అందులో నాకు ఖాతా లేదు. ఫేక్ ట్విటర్ ఖాతాలను ఫాలో కావొద్దని అందరినీ కోరుతున్నాను. అలాగే, అలాంటి ఖాతాల గురించి రిపోర్ట్ చేయండి. అందరూ అప్రమత్తంగా ఉండండి’’ అని ఆ ప్రకటనలో వైష్ణవ్ పేర్కొన్నాడు. అయినా ఇంత ఇబ్బంది పడే బదులు ఓ ట్విటర్ ఖాతా తెరిచి.. వెరిఫైడ్ చేసుకొని .. దానిని షేర్ చేస్తే సరి కదా వైష్ణవ్.
‘ఉప్పెన’తో ఎంట్రీలోనే సూపర్ అనిపించుకున్న… ఆ తర్వాతి సినిమా ఏంటి అనేది ప్రకటించలేదు. అంటే రెండో సినిమా కాదు. మూడో సినిమా. ఎందుకంటే రెండో సినిమాను క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే. ‘కొండపొలం’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందింది. మరి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అనేది తెలియాల్సి ఉంది. మరి మూడో సినిమా సంగతేంటో చెప్పాలి. మొన్నామధ్య అనుదీప్‌తో అని అన్నారు చూద్దాం.