క్రికెటర్‌కి సెంచరీ, సినిమా నటులకు వందో సినిమా ఎంతో ప్రత్యేకం. నెర్వస్ 90`s అంటూ క్రికెట్‌లో ఉంటాయి. అయితే అక్కడ నెర్వస్ క్రికెటర్‌కి. కానీ సినిమాల్లో ఆ నెర్వస్ అభిమానులకు. ఎందుకంటే 90వ సినిమా చేశాక, వందో సినిమా వరకు మంచి విజయాలు అందుకుంటూ వెళ్లాలి. అప్పుడే వందో సినిమాగా బాక్స్ బద్దలయ్యే సినిమా పడుతుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి వందో సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అంటే నాగార్జున అభిమానులే.
ప్రస్తుతం నాగార్జున 96 సినిమాల్లో నటించారు. ఇక్కడ హీరోగా నటించిన సినిమాలే తీసుకున్నాం. అతిథి పాత్రలు, అలా మెరిసి వెళ్లిపోయిన పాత్రలు పక్కన పెట్టేశాం. ప్రస్తుతం చేస్తున్న ‘ది ఘోస్ట్’, ‘బ్రహ్మాస్త్రం’తో నాగ్ సినిమాల కౌంట్ 98కి చేరుతుంది. దీంతో నెక్స్ట్ చేయబోయే రెండు సినిమాలు ఏంటి అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఏ హీరో అయినా తన వందో సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని చూస్తారు. అలా నాగ్ ఏ సినిమా చేస్తారు అనేదే ఇక్కడ చర్చ.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాప్ 4 హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఉన్నారు. చిరు, బాలయ్య ఇప్పటికే వందో మైలు రాయి దాటేశారు. నెక్స్ట్ లైన్‌లో ఉన్నది నాగార్జుననే. చిరంజీవి వందో సినిమాగా ‘త్రినేత్రడు’ చేశారు. బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చేశారు. ఆ రెండు సినిమాలు ఆశించినంత మేర భారీ విజయాన్ని అందివ్వలేదు. ఇప్పుడు నాగార్జున నుండి అలాంటి రిజల్ట్ కాకుండా బ్లాక్‌బస్టర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
దీంతో ఇక్కడే అసలు సమస్య వచ్చింది. నాగార్జున నెక్స్ట్ అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలంటే నేటి యంగ్ డైరక్టర్స్ లేదంటే స్టార్ దర్శకులు కావాలి. అయితే ఇప్పటికిప్పుడు ఎవరూ ఖాళీగా లేరు. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌తో వరుస సినిమాలు ఓకే చేసుకొని సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. దీంతో కొత్త దర్శకుడితోనే వందో సినిమా చేస్తారా? లేదంటే పాత స్టార్ దర్శకుడితో చేస్తారా అనేది తెలియడం లేదు. అయితే వందో సినిమా తేలాలంటే ముందు 99వ సినిమా తేలాలి. చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది.