బిగ్‌బాస్ ఐదో సీజన్ అప్పుడే హాఫ్ సీజన్ పూర్తి చేసుకుంటోంది. సీజన్‌లో ఏడో వారం వచ్చేసింది. దీంతో బిగ్‌బాస్ కూడా నామినేషన్ల వేడిని పెంచాడు. ప్రక్రియలో కూడా వైవిధ్యం చూపించాడు. ఈ ప్రక్రియలో జశ్వంత్, శ్రీరామ్, సన్నీ వేటగాళ్లుగా పెట్టారు. మిగిలిన వాళ్లు నామినేట్ చేయొచ్చు. ఈ క్రమంలో ఎవరు నామినేట్ అయ్యారు అనేది చూద్దాం.
కొత్తది కాదు.. కానీ కొత్తదే..
బిగ్‌బాస్ ఈ సారి కొత్తగా నామినేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. అయితే ఇదేం కొత్తది కాదు. గత సీజన్లలో చేసింది. హంటర్ నామినేషన్ ఇప్పటికే చూశాం. చెట్టుకు పళ్లు పెట్టి కోయడమూ చూశాం. ఇప్పుడు ఆ రెండూ కలిపి ఈసారి చేశారు. బిగ్‌బాస్ బయట గార్డెన్‌లో సేవ్ ట్రీని ఏర్పాటు చేసి… ఇంటి సభ్యుల ముఖాలున్న కోతుల బొమ్మల్ని వేలాడదీశారు. గన్ సౌండ్ వినిపించినప్పుడల్లా వేటగాళ్లు తమ డేరా నుంచి బయటకు వచ్చి వేలాడుతున్న కోతుల్ని చంపి నామినేట్ చేయాలి.
ఇక కోతుల లక్ష్యం… ఆ వేటగాళ్లని ఒప్పించి వారిని (కోతి బొమ్మల్ని) చంపకుండా చూసుకోవడం. దానికి బదులు ఇతరుల్ని నామినేట్ చేయడం. ఇది ఒక పని అయితే… ముగ్గురు వేటగాళ్లలో ఎక్కువ సార్లు డేరా నుంచి బయటకు వచ్చి.. ఎక్కువ కోతుల్ని వేటాడి నామినేట్ చేసిన వేటగాడు సేవ్ అవుతాడని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో మిగిలిన ఆ ఇద్దరు వేటగాళ్లు అవుతారు. నామినేట్ చేయమని అడిగే హౌస్‌మేట్స్ నేరుగా రావడానికి లేదు. టేబుల్‌పై పెట్టిన రెండు అరటి పళ్లను ఎవరు మొదట పట్టుకుంటే వారే వేటగాడితో చర్చించి… ఓ హౌస్‌మేట్‌ను నామినేట్ చేయాల్సి ఉంటుంది.
నామినేట్ అయ్యింది వీరే…
అలా ఈ వారం సిరి, రవి, కాజల్, అనీ మాస్టర్, ప్రియ నామినేట్ అయ్యారు. మరోవైపు డేరా నుండి ఒక్కసారీ బయటకు రాని కారణంతో వేటగాళ్లు శ్రీరామ్, జెస్సీ నామినేట్ అయ్యారు. వీరితోపాటు ఇక్కడే బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యారు. లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోను ఈ లెక్కన వీలైనంత త్వరగా బయటకు తీసుకొచ్చేస్తారని తెలుస్తోంది.