అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమృత ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు కలర్ ఫొటో చిత్రానికి కథ కూడా అందించడం విశేషం. ప్రముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా యాప్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల అవుతుంది. ఈ నేఫథ్యంలో నిన్న జరిగిన కలర్ ఫొటో కలర్ ఫుల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిత్ర బృందంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రముఖ యువ దర్శకులు హాజరైయ్యారు. ప్రముఖ దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్, శివ నిర్వాణ, హను రాఘవపూడి తదితరులు ఈ ప్రొగ్రామ్ కు అతిధులుగా విచ్చేసి చిత్ర బృందానికి తమ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా
దర్శకుడు మారుతి మాట్లాడుతూ
లాక్ డౌన్ తరువాత మళ్లీ సాధరణ పరిస్ధితులుకి చిత్ర పరిశ్రమ వస్తుందనడానికి ఈ ఫంక్షన్ ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. నిర్మాత సాయిరాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా కథను కూడా అందించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆహా యాప్ ద్వారా అక్టోబర్ 23న విడుదల కాబోతున్న ఈ సినిమా కచ్ఛితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు.
సునీల్ గారు మాట్లాడుతూ
అన్ని ఫార్మాట్స్ లో యాక్ట్ చేసే అవకాశం నాకు వస్తుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీకి విలన్ అవుదామనే వచ్చాను, కానీ కమీడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చాలా సినిమాలు చేసేశాను. ఈ సినిమా కథ వినగానే మారు మాట్లాడకుండా నటించడానికి ఒప్పకున్నాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను కచ్ఛితంగా ప్రేక్షకులకి నచ్చుతుందని నమ్ముతున్నాను.
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ
సాయిరాజేశ్ ప్రొడ్యూస్ చేసే సినిమా అంటే నా సొంత సినిమాగా నేను భావిస్తాను. త్వరలోనే మా ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉండబోతుంది. అలానే కలర్ ఫొటో దర్శకుడు సందీప్ నెక్ట్స్ సినిమాకు కూడా నేను నిర్మాతగా వ్యవహరించబోతున్నాను. ఆహా యాప్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందగా ఉంది. ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సుహాస్, చాందినీలకు ఆల్ ది బెస్ట్. సునీల్ గారు యాక్ట్ చేయడంతో ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్.
చిత్ర నిర్మాత సాయిరాజేశ్ మాట్లాడుతూ
య్యూట్యూబ్ నుంచి తన ప్రస్ధానం మొదలుపెట్టి ఇప్పుడు ఓ ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే స్థాయికి దర్శకుడు సందీప్ చేరుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సినిమాను తెరకెక్కించడానికి మా చిత్ర యూనిట్ పడిన కష్టం తెర పై కనిపిస్తోంది. ఆర్టిస్ట్ గా సుహాస్ ఆల్రెడీ తనని తాను ప్రూవ్ చేసుకున్నారు, హీరోగా కూడా ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాడని భావిస్తున్నాను. అలానే చాందినీ కూడా తన నటనతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. సునీల్ గారు మా సినిమాకు ఉన్న పెద్ద పాజిటివ్ పాయింట్. ఆహా యాప్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
దర్శకులు శివనిర్వాణ, కృష్ణ చైతన్య, హనురాఘవపూడి మాట్లాడుతూ
సాయిరాజేశ్ తో ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నాము. ఈ సినిమాకు కథ ఇవ్వడమే కాకుండా తానే మరో దర్శకుడుకి అవకాశం ఇచ్చి సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలానే సాయిరాజేశ్ తోడుగా మరో నిర్మాత బెన్నీ గారు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం కూడా చాలా అభినందనీయం. ఇక ఆర్టిస్ట్ సుహాస్ ఇప్పుడు హీరోగా కూడా ప్రూవ్ చేసుకుంటాడని నమ్ముతున్నాము. చాందినీకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాము. సునీల్ గారు ఈ సినిమాతో విలన్ గా కూడా సక్సెస్ అవ్వబోతున్నారు, ముంగానే ఆయనకు కంగ్రాట్స్ చెప్పేస్తున్నాము. అలానే ఆహా యాప్ ద్వారా అక్టోబర్ 23న విడుదల అవ్వబోతున్న కలర్ ఫొటోకి కలర్ ఫుల్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాము.
చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ
సినిమాలు మీద అభిమానంతో ఏదో చేయాలనే కసితో 2013లో హైదరాబాద్ వచ్చాను. రైటర్ గా ఛాయ్ బిస్కెట్ కంపెనీలో చేరి, ఆ తరువాత య్యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసి దాదాపు 7 ఏళ్లకి బిగ్ స్క్రిన్ చేరుకున్నాను. నన్ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న సాయి రాజేశ్ గారికి ఎల్లప్పూడూ రుణ పడి ఉంటాను. ఆయన సొంత కథ నాకు ఇచ్చి, నన్ను నమ్మి ఈ సినిమా తీశారు. ఇక హీరో సుహాస్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం కలిసే సినిమా ప్రయత్నాలు చేశాము, మావాడు ఈ కథకి పర్ ఫెక్ట్ ఆప్షన్, చాందిని కూడా ఫార్ట్ ఫిల్మ్స్ నేపథ్యంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటన ఆకట్టుకుంటుంది. ఆహా ద్వారా మా సినిమా విడుదల అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సునీల్ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా అనిపించిందని అన్నారు.
చిత్ర హీరోయిన్ చాందినీ మాట్లాడుతూ
ఈ చిత్రంలో నాకు చాలా వెరేయేషన్స్ ఉన్న పాత్ర దొరికింది. నన్ను నేను మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన అవకాశంగా భావిస్తున్నాను. ఈ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.
చిత్ర హీరో సుహాస్ మాట్లాడుతూ
ఆర్టిస్ట్ గా ఉండటం చాలా ఈజీ కానీ హీరోగా ఉండటం ఎంత కష్టమో ఇప్పుడు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో నేను నా అభిమాన నటుడు సునీల్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. మా కలర్ ఫొటో టీమ్ అంతా ఓ సిన్సియర్ ఎట్మెంట్స్ చేశాము, ప్రేక్షకుల మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు