యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో హాలీవుడ్ సినిమా చేసే అవకాశం ఉంది. ఆయనతో సినిమా చేయడానికి హాలీవుడ్ దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’ సినిమా లో కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. ఇక, ‘కొమురం భీముడో కొమురం భీముడో…’ పాటలో నటన గురించి ఎంత చెప్పినా తక్కువే! ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ నటన కేవలం భారతీయులను మాత్రమే కాదు… హాలీవుడ్ దర్శకులను సైతం ఆకట్టుకుంది. అదీ ఎంత ఎలా అంటే…
ఆయనతో సినిమా చేయాలని ఉందంటూ ఏకంగా హాలీవుడ్ దర్శకులు తమ మనసులో మాటను బయట పెట్టేంత! అదీ విదేశాల్లో తారక్ మీద ఉన్న క్రేజ్! ‘నాటు నాటు…’ పాటకు అవార్డు వచ్చిన సందర్భంగా ఆస్కార్ వేడుకలకు అమెరికా వెళ్ళినప్పుడు, అంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కోసం వెళ్ళినప్పుడు… హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని ఎన్టీఆర్ చెప్పారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు. బట్, ఫర్ ఎ చేంజ్… ఇప్పుడు ఆయనతో పని చేయాలని హాలీవుడ్ దర్శకులు చెబుతున్నారు.
‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ ఉన్నారు కదా! ఇప్పుడు ‘సూపర్ మ్యాన్ : లెగసీ’ తీస్తున్నారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ఒకవేళ ఎవరైనా భారతీయ నటులను గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా? అని అడిగితే… ఎన్టీఆర్ పేరు చెప్పారు జేమ్స్ గన్. ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తుందా? వ్యాన్ లోనుంచి పులులు, వన్య మృగాలతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం ఉంది కదా..
అది నటన ఇష్టమని జేమ్స్ గన్ పేర్కొన్నారు. అందులో (Jr NTR) ఎన్టీఆర్ చాలా కూల్ యాక్టింగ్ చేశారని ప్రశంసించారు. ఈ మాటలు ఎన్టీఆర్, నందమూరి అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి.’ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా, వరల్డ్ లెవల్ మార్కెట్ పెంచుకునే దిశగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆ స్థాయి కథలు, క్యారెక్టర్స్ మీద దృష్టి పెట్టారు. కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిందీలో ‘వార్ 2’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు ఎన్టీఆర్.
హృతిక్ రోషన్ తో ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో ఆయన కనిపిస్తారట. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. పైగా, ఆయన నటనకు హిందీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్ను తీసుకోవడం ద్వారా సౌత్ ప్రేక్షకుల్లోకి కూడా ‘వార్ 2’కు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అందరూ భావించారు.
ముందు అనుకున్న లైనప్ కూడా అదే అయితే… ‘వార్ 2’ రావడంతో మొత్తం లైనప్ మారింది. ఎన్టీఆర్ 32వ సినిమా ప్రశాంత్ నీల్ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఆ సినిమా రూపొందుతోంది. ఆ తర్వాత కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు ఎన్టీఆర్ చేయనున్నారు.