సంక్రాంతికి సినిమాలు చూడాలంటే ఆస్తులు ఆమ్ముకోవాలి? అంత డబ్బులు పెట్టి సినిమాలు చూసే బదులు ఓటీటీలోకి వచ్చేంతవరకు ఆగొచ్చు కదా? ఇన్నేసి సినిమాలు ఒక సమస్య అయితే, అంతేసి టికెట్లు ఇంకో సమస్య! ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ‘పొంగల్ ఫైట్ 2024’పై సోషల్ మీడియాలో, సినీ గోయర్స్‌లో వినిపిస్తున్న మాటలు ఇవీ. ఎందుకంటే సినిమా టికెట్ల రేట్లు, సినిమా చూడటానికి వెళ్తే అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది అంటున్నారు.
కావాలంటే మీరే చూడండి ప్రస్తుతం సంక్రాంతికి (Sankranthi) నాలుగు సినిమాలు బాక్సాఫీసు బరిలో ఉన్నాయి. అందులో ఒకటి చిన్న సినిమ కాగా, మిగిలిన మూడు పెద్ద హీరోల సినిమాలే. అయితే తెలంగాణ వరకు వచ్చేసరికి అన్నీ పెద్ద సినిమాలే అనుకోండి. ఎందుకంటే ఇక్కడ సినిమాల పరిస్థితితో సంబంధం లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా రేటు పెంచుకోవచ్చు అనే రూల్ ఉంది. దీంతో అన్నీ పెద్ద సినిమాలే. అలా ఓ మంచి థియేటర్ లేదా మల్టిప్లెక్స్‌లో సినిమా చూడాలి అంటే టికెట్‌కు రూ. 400 వరకు చెల్లించాల్సిందే.
ఇక రాను పోను ఖర్చులు, ఇంటర్వెల్ ఖర్చులు ఇలా లెక్క చూస్తే ఒక్కొక్కరి రూ. 700 వరకు పడుతుంది అని లెక్కేస్తున్నారు సినీ గోయర్స్. అదే ఏపీలో అయితే ఇందులో దాదాపు సగం పడుతుంది. అయితే ఇదంతా ఒక సినిమా చూసినవాళ్ల లెక్క. అదే అన్ని సినిమాలూ చూద్దాం అంటే మొత్తంగా హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో రూ. 3000 అవుతుంది. అదే తెలంగాణలో ఇతర ప్రాంతాలు, ఏపీలో అయితే అందులో సగం అనుకోవచ్చు. మరి అదే ఫ్యామిలీ వెళ్తే ఎంతో మీరే లెక్కేసుకోవచ్చు.
దీంతో కొంతమంది సినీ గోయర్స్ ఓ వారం తర్వాత వెళ్తే పోలా అని అనుకుంటున్నారట. దాని వల్ల సగం డబ్బులు సేవ్ అవుతాయి అనేది వాళ్ల ఆలోచన. టికెట్‌రేట్లు ఇలానే ఉంటే కచ్చితంగా ఎవరైనా ఇదే మాట అనుకుంటారు. కాబట్టి అందినకాడికి జనాల దగ్గర పిండేద్దాం అనుకోవడం సినిమాకు మంచిది కాదు అని కొంతమంది సూచిస్తున్నారు. కానీ ఈ మాటలు ఎవరైనా వింటారంటారా?