ప్రభాస్‌తో సినిమా చేస్తే స్టార్ డమ్ రావడం పక్కా.. అలాగే ఎక్కువగా తినేసి పొట్ట ఉబ్బిపోవడం పక్కా. స్టార్ హీరో హీరోయిన్లు, నటులు ఈ మాట చెబుతుంటారు. ఆయన స్టార్ హీరో అయ్యాక తనతో పని చేసిన అందరికీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టి మరీ తన ప్రేమను వడ్డిస్తుంటాడు ప్రభాస్. దీంతో తొలుత ఇదో కొత్త విషయంలా ఉన్నా.. ఇప్పుడు ఏముంది ప్రభాస్ సినిమా అంటే అంతే. డార్లింగ్ ఫుడ్ పంపడం, వాళ్లు తిని ఆనందంతో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం కామన్ అనే పరిస్థితి వచ్చింది.
‘ఫౌజీ’ సినిమా ప్రారంభమవుతున్న సమయంలో హీరోయిన్ ఇమాన్వీని చూసి చాలామంది ఇదే మాట అనుకుని ఉంటారు టాలీవుడ్‌లో. ఇప్పుడు అదే జరిగింది అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ప్రభాస్ మీరు పంపిన ఫుడ్ తిని మనసు, పొట్ట నిండిపోయాయి అని రాసుకొచ్చింది. ఆ వీడియోలో చూస్తే పులావ్, చికెన్, క్యాజు ఫ్రై టైప్, స్వీట్ కనిపిస్తున్నాయి. అంత తిన్నాక, అదీ డార్లింగ్ ప్రేమతో తెప్పించిన ఫుడ్ తిన్నాక పొట్ట, మనసు నిండటంతో ఆశ్చర్యమేముంది.

ముందే చెప్పినట్లు ప్రభాస్‌తో సినిమా చేసిన హీరోయిన్లు, ప్రధాన నటులకు ప్రభాస్ ఫుడ్ ఫెస్టివల్ ఎన్నాళ్లుగానే వస్తోంది. ‘కల్కి’ సినిమా సమయంలో అమితాబ్ బచ్చన్, అప్పటి హీరోయిన్ దీపికా పడుకొణె, దిశా పటానీకి ఇలానే ఫుడ్ వచ్చింది. అంతకుముందు ‘సలార్’ సినిమా సమయంలో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఇలానే చేశాడు ప్రభాస్. పృథ్వీరాజ్‌కి అయితే ఓ హోటల్ రూమ్ పట్టేంత ఫుడ్ పంపించాడు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఇమాన్వీ పరిస్థితీ అంతే మరి.

‘ఫౌజీ’ విషయానికొస్తే హను రాఘవపూడి రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా 930-40 నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
