గతకొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు, మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల మృతిచెందారు. ‘కె.జి.ఎఫ్’ తాతగా పాపులర్ అయిన సీనియర్ నటుడు కృష్ణ జి రావు నిన్న (డిసెంబర్ 7) మరణించారనే వార్త మర్చిపోకముందే.. మరో ప్రముఖ తమిళ నటుడు శివ నారాయణ మూర్తి అనారోగ్యం కారణంగా కన్నుమూశారని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది..
టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ రాజసింహ రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆయన ఎడమ కాలు విరగిందనే వార్త వైరల్ అవుతుండగా.. పరిశ్రమలో మరో పిడుగు పాటు లాంటి వార్త వినిపించింది.. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన తల్లి గీతా దేవి కన్నుమూశారు.. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గీతా దేవికి (20 రోజులుగా) ఢిల్లీలోని మ్యాక్స్ పుష్పాంజలి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం (డిసెంబర్ 8) ఉదయం 8:30 గంటలకు తుది శ్వాస విడిచారు.. ఆమెకు మనోజ్ కాకుండా మరో కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు.. గతేడాది మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి రాధా కాంత్ బాజ్‌పాయ్ కన్నుమూశారు. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే తల్లి గీతా దేవి కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తన తల్లి తనకు ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండే వారని..
తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టమని మనోజ్ బాజ్‌పాయ్ పలు ఇంటర్యూలలో చెప్పారు.. గీతా దేవి మృతికి బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. నాగార్జున మేనల్లుడు సుమంత్ నటించిన ‘ప్రేమకథ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన మనోజ్ బాజ్‌పాయ్.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’, ‘వేదం’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. హిందీలో మూడు సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్న మనోజ్ ఇటీవల ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ (రెండు సీజన్లు) తో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు..