నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఊరుకోను… అంటాడు అదేదో సినిమాలో బుడ్డోడు. ఆ మాటకు తగ్గట్టే ప్రజల కోసం చాలా కష్టాలే పడతాడు. అలాంటి సినిమా రాజ్యం ఇప్పుడు కష్టాల్లో ఉంది. మరి వెనుదిరగని పోరాటం చేసే రాజు ఎవరు? గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇదే ప్రశ్న రేగుతుంది. తొలుత ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌కు రాజకీయం ముద్ర వేసి పక్కన పెట్టేశారు. పరిశ్రమ కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత నాని స్పందిస్తే… బలం చాలలేదు. దీంతో ఏవేవో తాటాకు చప్పుళ్లు వినిపించాయి.కానీ ఉపయోగం లేదు.
దీంతో టాలీవుడ్ రాజు లేని రాజ్యం అయిపోయిందా అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నేను కాడి వదిలేస్తున్నా అని చెప్పకనే చెబుతూ చిరంజీవి ‘పెద్ద’రికం పక్కనపెట్టేశారు. దీంతో మొత్తం చూపు మోహన్‌బాబు మీద పడింది. ఆయనేమో లేఖ రాసి గమ్మునున్నారు. దీంతో ఇక టాలీవుడ్ కష్టాలు ఎవరూ పట్టించుకోరా అని అనుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వివాదాల జీవి ఆర్జీవీ వచ్చి పరిస్థితిని ట్వీట్లతో టీజ్ చేశాడు. దీంతో ప్రభుత్వం నుండి ప్రశ్నలు, విమర్శలు మొదలయ్యాయి. పరిస్థితి మరింత చేయి దాటుతుంది అని అనుకుంటుండగా చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాడు.
పరిశ్రమ పెద్ద అనో లేక పరిశ్రమ బిడ్డ అనో ఏదో ఒక పేరుతో ఆయన ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడి పరిస్థితి ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది. మరి జగన్ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది, చిరంజీవి చెప్పినట్లు కొత్త జీవో తీసుకొస్తారా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగి టాలీవుడ్ పరిస్థితి బాగుపడితే బాస్ తన పేరు, స్థానం తిరిగి సాధించినట్లే.
ఈసారి తానే వచ్చి పెద్దరికం నాది అనడం కాదు. ఏకంగా టాలీవుడ్ వచ్చి ‘మీరే పెద్ద’ అంటుంది. ఎందుకంటే కష్టం తీర్చేవాడే నాయకుడు అవుతాడు. కష్టాన్ని చూసి ‘మనం ఇలా చేయకుండా ఉండాల్సింది’ అనేవాడు కాదు. కాబట్టి… టికెట్ల సమస్య పరిష్కారం అయితే టాలీవుడ్‌లో ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒకటి సినిమా సమస్య తీరడం, రెండోది చిరంజవే పెద్ద అని చెప్పకనే చెప్పడం.