ప్రముఖ నటుడు పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయనకు వైద్యం కోసం చిరంజీవి అందించిన సాయం గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. ఒక్క ఫోన్ కాల్‌తో చిరంజీవి.. పొన్నాంబంళంకు సాయం చేశారని కూడా తెలుసు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇటీవల పొన్నాంబళం వివరించారు. నా గొంతులో ఉన్న ప్రాణం, ముఖంపై వచ్చిన నవ్వు… ఇవన్నీ చిరంజీవి పెట్టిన భిక్షే అంటూ ఎమోషనల్ అయ్యారు. కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పొన్నంబళం పరిస్థితి ఇటీవల విషమించడంతో హాస్పటల్‌లో చేర్చారు. కిడ్నీ మార్పిడి చేస్తే కానీ ప్రాణం దక్కదని వైద్యులు చెప్పేశారు.
దాని కోసం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారట. దీంతో అంత డబ్బులు దగ్గర లేక ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారట. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పంతులు ‘జై చిరంజీవ.. జై చిరంజీవ’ అని అంటున్నారట. దాంతో చిరంజీవి గుర్తొచ్చి.. ఆయనను అడుగుదాం అనుకున్నారట పొన్నాంబళం. అనుకున్నదే తడవుగా చిరంజీవికి ఫోన్ చేయగా.. ఏకంగా రూ.58 లక్షలు సాయం చేశారని పొన్నాంబళం తెలిపారు. అలా పూర్తి ఆరోగ్యంతో మీడియా ముందుకు వచ్చిన పొన్నంబళం నాటి విషయాలు చెప్పుకొచ్చారు. డయాలసిస్ కోసం అవసరం అవుతుందేమో అని చిరంజీవిని డబ్బులు అడుగుదాం అనుకున్నారట.
అప్పట్లో డయాలసిస్ ఖర్చు నెలకు రూ. 70 వేల వరకు అయ్యేదట. ఆ డబ్బుల కోసం ట్రై చేస్తే.. అంత పెద్ద మొత్తంలో ఇచ్చారు అని చెప్పారు. ‘‘సార్ నేను పొన్నంబళం, ప్లీజ్ కాల్ మీ’’ అని చిరంజీవికి మెసేజ్ పెడితే బాగుంటుందేమో అనుకుంటూ.. మళ్లీ ఏమైనా అనుకుంటారేమో అని అనుకున్నారట పొన్నాంబళం. కానీ కాల్ చేయడానికి ధైర్యం చాలక ఆ మెసేజ్ పెట్టారట. వెంటనే రిప్లై వచ్చిందట. ‘పొన్నంబళం ప్లీజ్ వెయిట్ 10 మినిట్స్.. నేను షూటింగ్‌లో ఉన్నా.
పది నిమిషాల్లో కాల్ చేస్తా’ అని అన్నారట. అన్నట్లుగానే పది నిమిషాల్లో కాల్ వచ్చిందట. ఆ వెంటనే ఆయన మాట్లాడి, అపోలో ఆస్పత్రికి వెళ్లమని చెప్పారట. అలా వెళ్తే ఆపరేషన్‌కి రూ. 50 లక్షలు అవుతాయని తెలిసిందట. అయితే అదేం పట్టించుకోవద్దు అంతా ఆయన చూసుకుంటారని డాక్టర్లు చెప్పడంతో మార్పిడి చేసుకున్నారట. ఆ తర్వాత ఇప్పుడు కూడా మందులు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత ఉపాసన తరచూ మాట్లాడి బాగోగులు తెలుసుకునేవారని, (Ponnambalam) చిరంజీవి ఆస్పత్రికి వచ్చి కలిశారని కూడా చెప్పారు.