ప్రదీప్ మాచిరాజు… మంచి యాంకర్, మంచి హోస్ట్, మంచి టైమింగ్ ఉన్న నటుడు… ఇన్ని మంచిలతో పాటు ‘మంచితనం’ కూడా ఉంది. తాజాగా ఈ మంచితనం ఓ టీవీ షోలో బయటపడింది. అంతేకాదు… గతంలో ఆయన చేసిన మంచి పనులు కూడా ఈ సందర్భంగా బయటికొచ్చాయి. ఏం రేంజిలో ఆ మంచి గురించి చెప్పారు అంటే… ఏకంగా ప్రదీప్‌కి సన్మానం కూడా చేసేశారు. దాంతో పాటు ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ఓ పెద్ద మానవతావాదితో కంపేర్ చేస్తూ ఆకాశానికి ఎత్తేశారు.
జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘సరిగమప’లో పవన్ కల్యాణ్ అనే యువకుడు పార్టిసిపెంట్స్‌గా ఉన్నాడు. అతని తండ్రి కారు డ్రైవ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాంతోపాటు కొడుకు అభిరుచిని ఇష్టపడి ప్రోత్సహిస్తున్నారు. ఆ విషయాన్ని తండ్రి, తన మాస్టారు సమక్షంలో వేదికపై పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను పెద్ద కొడుకు అనుకోండి అంటూ ప్రదీప్ సాయం చేయడానికి ముందుకొచ్చారు. దాంతోపాటు పవన్ చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు కట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. దానికి మొత్తం వేదిక అంతా చప్పట్లతో మెచ్చుకున్నారు.
లాక్‌డౌన్ టైమ్‌లో ప్రదీప్ చాలామందికి సాయం చేశాడు అంటూ సింగర్ సాకేత్ చెప్పాడు. ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ సెట్ అసిస్టెంట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రదీప్‌కు సన్మానం చేశారు. లాక్‌డౌన్ టైమ్‌లో సినిమాలకు సోనూ సూద్ ఉంటే… టీవీలకు ప్రదీప్ మాచిరాజు అంటూ పొగిడేశారు. ఆ తర్వాత సన్మానం కూడా చేశారు. లాక్‌డౌన్‌కు ముందు ప్రదీప్ మీద పడ్డ చిన్న చిన్న మచ్చలు ఈ సందర్భంగా పూర్తిగా తొలగిపోయాయి. మనం కూడా మనిషిలో మంచే గుర్తుంచుకుందాం.