ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న చర్చ.. ‘హీరో – హీరోయిన్’. అంటే ఇండస్ట్రీలో నాయకా నాయికలను ఒకేలా చూడాలి అనేది ఆ చర్చ సారాంశం. పారితోషికం విషయంలో, గౌరవం విషయంలో ఇద్దరికీ అన్ని సమంగా రావాలి అనేది వాళ్ల మాట. ఈ విషయంలో కొంతమంది హీరోయిన్లు కూడా తరచుగా తమ గళం వినిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో రాములమ్మ అని అభిమానులు ప్రేమగా, గౌరవంగా పిలుచుకునే విజయశాంతి (Vijaya Shanthi) కూడా ఉన్నారు. తాజాగా మరోసారి ఆమె ఆ టాపిక్ రెయిజ్ చేశారు.
ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మొన్నీమధ్య ఓ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కొత్త అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. కొన్నాళ్లుగా పరిశ్రమలోరి పరిణామాల్ని గమనించి ‘సినిమాల్ని చంపేయొద్దు’ అని ఈ మధ్య మాట్లాడాను అని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.
చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది బతుకుతున్నారని, అందుకే బాధ్యతగా వ్యవహరించాలని చెప్పానని తెలిపారు. ఇక అసలు పాయింట్‌కి వస్తే పరిశ్రమలో హీరోలతో సమానంగా హీరోయిన్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అని ఆమె సూచించారు. అప్పట్లో ఎన్టీఆర్ (Sr NTR) తన కంటే చిన్నవాళ్లను కూడా ‘మీరు..’ అనే మాట్లాడేవారని, అందరితో గౌరవంగా మెలిగే గుణాన్ని ఆయన్ని చూసే నేర్చుకున్నా అని విజయశాంతి చెప్పారు.
నేటి హీరోయిన్లకి చిన్న పాత్రలు దక్కుతున్నాయని, వాళ్లు కూడా వాళ్ల పరిధిలో నటిస్తున్నారని, పెద్ద పాత్రలు ఇస్తే వాళ్లూ నిరూపించుకుంటారు అని విజయశాంతి సూచించారు. ఇక ఆమె గురించి చెబుతూ.. నేటితరం కూడా నన్ను రాములమ్మ అనే పిలుస్తుంటారని, సభలకు వెళ్లినప్పుడు కొత్త తరం కూడా రాములక్క అని పిలుస్తుంటే మొదట్లో ఆశ్చర్యంగా అనిపించేదని చెప్పుకొచ్చారామె. మీ ధైర్యం మాకు స్ఫూర్తి అని ఎవరైనా చెప్పినప్పుడు తృప్తిగా ఉంటుందని తెలిపారు.