చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఎందుకు వచ్చింది? సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు, సమాజ సేవ తదితర కారణాలు వల్ల ఇచ్చారు అని చెప్పేయొచ్చు. అయితే అవన్నీ కాకుండా మరో కారణం కూడా ఉందా? దాని వల్లే చిరు తిరిగి రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరపతిని పెంచుకునే దిశగానే చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి ఉంటారు అనేది ఆ పుకార్ల సారాంశం.
నిజానికి రాజకీయాలు చిరంజీవికి కొత్త కాదు. గతంలో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి, 18 స్థానాల్లో గెలిచారు కూడా. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మంత్రి పదవి తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని అంటున్నారు. అయితే డైరెక్ట్ రాజకీయాలు కాకుండా… రాజ్యసభ సభ్యుడు అవుతారు అనేది లేటెస్ట్ పుకార్ల సారాంశం.
భాజపా తరఫున ఆయన రాజ్యసభకు వెళ్తారు అని.. ఆ తర్వాత పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్‌గా కూడా చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి చిరు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదు. ఆయన సన్నిహిత వర్గాలు ఇదే మాట చెబుతున్నాయి. కానీ పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన నేపథ్యంలో బీజేపీ నుండి ఈ మేరకు ప్రతిపాదన వచ్చింది అని చెబుతున్నారు. చిరుని తమ పార్టీవైపు లాక్కోవడానికే బీజేపీ పద్మ విభూషణ్ ఇచ్చిందని అంటున్నారు.
ఇప్పటికిప్పుడు చిరంజీవిని (Chiranjeevi) తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు పంపించేంత బలం బీజేపీకి లేదు. దీంతో త్వరలోనే ఉత్తర ప్రదేశ్ నుండి కానీ బీహార్ కోటా నుండి కానీ పంపిస్తారని ప్రాంతాల పుకార్లు కూడా వస్తున్నాయి. నిజానికి పద్మ విభూషణ్ పురస్కారం ముందు నుండే చిరంజీవి బీజేపీకి దగ్గరగా ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు గోవాలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా వచ్చింది అనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.