‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో మానస సరోవరం ఎపిసోడ్ వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆ సీన్స్ మనం అసలు సినిమాలో చూసేవాళ్లమే కాదు. అవును, ఈ విషయం చిరంజీవే చెప్పారు. తొలుత ఆ సీన్స్ బదులు చంద్రమండలం సీన్స్ అనుకున్నారట. అయితే చిరంజీవి కారణంగా ‘మానస సరోవరం సీన్స్’ వచ్చాయట. వీటి గురించి చిరంజీవే చెప్పారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కథ పనులు జరుగుతున్నప్పడు సత్యానంద్, సత్యమూరి, యండమూరి, జంధ్యాల లాంటి వారితో కథా చర్చల్లో అప్పుడప్పుడు కూర్చునేవారట చిరంజీవి.
ఆర్టిస్ట్‌వి కదా ఇక్కడెందుకు అని ఎప్పుడూ ఎవరూ అనలేదట. ఈ క్రమంలో సినిమాకి మెయిన్ పాయింట్ అయిన చిన్నారికి కాళ్లు చచ్చుబడిపోయిన సీన్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయట. దాని కోసం ఇప్పుడున్న సీన్ కాకుండా ముందు వేరే అనుకున్నారట. డీఆర్‌డీవో వాళ్లు చంద్రమండలం మీదకు రాకెట్ పంపిస్తారని, అందులో వెళ్లి వస్తే డబ్బులు వస్తాయని, దాంతో వైద్యం చేయించొచ్చు అనేలా తొలుత సీన్ అనుకున్నారట. చంద్రమండలం మీదకు గైడ్ రాజు వెళ్తే.. అక్కడికి అతిలోకసుందరి వస్తే కలుసుకునేలా ముందు అనుకున్నారట.
అయితే ఆ సీన్ సరిగ్గా ఉండదు అనిపించదట. ‘రుద్రనేత’ సినిమాలో ఇలా రాకెట్‌లో కూర్చుని పైకి వెళ్తాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే పని చేస్తే బాగోదు అని చిరంజీవి అన్నారట. అతిలోక సుందరి భూమి మీదకు వచ్చినట్లు చూపిస్తే బాగుంటుంది అన్నారట చిరంజీవి. మానససరోవరానికి అతిలోక సుందరి వస్తే.. బాగుంటుందని, అక్కడికి గైడ్ రాజు వెళ్లేలా రాస్తే బాగుంటుందని చెప్పారట చిరంజీవి. అయితే మానససరోవరానికి అతిలోకసుందరి వస్తుందా అనే డౌట్ వచ్చిందట.
చంద్రమండలం మీదకు వచ్చిన అతిలోకసుందరి మానససరోవరానికి ఎందుకు రాదు అని చిరంజీవి అన్నారట. అలా సినిమాలో అతిలోక సుందరి, చిరంజీవి కలిసి కనిపించే సీన్ వచ్చిందట. తొలుత ఈ సీన్స్ విషయంలో తటపటాయించిన దర్శకుడు రాఘవేంద్రరావు ఆ తర్వాత ఓకే అనుకుని.. ‘నేనెలా చూపిస్తానో చూడండి’ అంటూ సవాలుగా తీసుకొని మరీ చేశారట. ఆ సీన్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు తెలుసు.