2024 సంక్రాంతి వార్ ఎలా సాగిందో చూశాం. మొత్తం ఐదు సినిమాలు డేట్స్ మీద కర్చీఫ్‌లు వేసుకుని ఆఖరి వరకు నువ్వా నేనా అంటూ పోరాడి ఆఖరికి నాలుగు సినిమాలు వచ్చాయి. ఐదో సినిమా తప్పుకున్నా ఇప్పటివరకు సరైన ప్రతిఫలం దక్కలేదు. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు కర్చీఫ్‌లు వేయడం 2023 ఆఖరులో మొదలైతే.. ఈసారి ఏకంగా 11 నెలల ముందే మొదలైంది.
వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వార్‌కు ఇప్పటికే మూడు సినిమాలు ఫిక్స్ అవ్వగా… ఇప్పుడు నాలుగో హీరో కూడా అనౌన్స్ చేసేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగా’ అంటూ వచ్చి అదిరిపోయే విజయం అందుకున్నారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ చాలామంది నవ్వుకున్నా, పిచ్చా వీళ్లకు అనుకున్నా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చాం. విజయం సాధించాం. వచ్చే సంక్రాంతికి కూడా వస్తున్నా అని చెప్పేశారు.
అంటే నాగ్ (Nagarjuna) తన తర్వాతి సినిమాకు వచ్చే పొంగల్‌కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీంతో మొత్తంగా ముగ్గుల పండగకు నాలుగు సినిమాలు దాదాపు ఫిక్స్ అయ్యాయి. అయితే ఆ రోజుకు ఎంతవరకు సిద్ధమవుతాయి అనేదే ప్రశ్న. కానీ 11 నెలల ముందే చెప్పేశారు కాబట్టి అందరూ పక్కాగా ప్లాన్ చేసుకుని ఆ టైమ్ సిద్ధమవుతారు. ఎందుకు అంటే సంక్రాంతి సీజన్‌లో ఓ మోస్తరు సినిమాలు కూడా కోట్లలో వసూలు చేస్తున్నాయి కాబట్టి.
ఇన్ని చెప్పిన సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలేంటో చెప్పకపోతే బాగోదు కదా. చిరంజీవి – వశిష్ట ‘విశ్వంభర’ ఇప్పటికే గ్లింప్స్ ఇచ్చి మరీ అనౌన్స్ చేసేశారు. దిల్ రాజు ‘శతమానం భవతి’ సీక్వెల్ వస్తుందని చెప్పారు. ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’తో వస్తానని, ఏటా సంక్రాంతికి తన సినిమా ఒకటి ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పేశారు. ఇప్పుడు నాగార్జున కూడా చెప్పారు. అయితే అది ధనుష్‌తో చేయబోయే సినిమానా? లేక తన 100వ సినిమా (?)నా అనేది చూడాలి.