పవన్ కల్యాణ్ ఓ సినిమాకి అంత తీసుకుంటాడు, ఓ సినిమాకు ఇంత తీసుకుంటాడు అంటూ వార్తలు మీరు చదివే ఉంటారు. అయితే ఎక్కడా, ఎప్పుడు పవన్ కానీ, ఆయన నిర్మాతలు కానీ ఈ విషయాలు చెప్పలేదు. చెబితే ఏమవుతుంది అనే విషయం తెలియదు కానీ.. ఈ లెక్కలు అయితే ఏ హీరో చెప్పడు, పవన్ కల్యాణ్ కూడా ఇన్నాళ్లూ చెప్పలేదు. అయితే అందరిలా ఉంటే అతను పవన్ ఎందుకు అవుతాడు. ఎవరూ చేయనిది, ఎవరూ చెప్పనిది చెబుతాడు కాబట్టే.. పవర్‌స్టార్ అయ్యాడు. అలా ఇప్పుడు తన రెమ్యూనరేషన్ లెక్కలు కూడా చెప్పేశాడు.
అవును, ఓ సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే విషయన్ని పవన్ కల్యాణే చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. పొలిటికల్ స్టేజీ మీద రెమ్యూనరేషన్ గురించి ఎందుకు చెప్పాడు అనేగా డౌట్. ఎందుకంటే ఆయన రెమ్యూనరేషన్ గురించి, ఆస్తుల గురించి బయట వస్తున్న రూమర్సే. ఎవరో చెప్పడం ఏంటి? నేనే క్లారిటీ ఇస్తున్నా అంటూ తన రెమ్యూనరేషన్ రోజుకు రూ. 2 కోట్లు అని తేల్చేశాడు. దీంతో ఆయన లెక్క క్లియర్ చేశాడు. ఇప్పుడు రూమర్స్ ఆగడమే తరువాయి.
తాను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కానని.. తనకు డబ్బులు అవసరం లేదని చెప్పిన పవన్ అవసరమైతే డబ్బులు ఇస్తానని పవన్ అన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాకు 22 రోజులు కాల్‌షీట్స్ ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు… రోజుకు రెండు కోట్ల రూపాయలు. 20 రోజులు పని చేస్తే దాదాపు రూ. 45 కోట్లు తీసుకుంటాను. అలా అని ప్రతి సినిమాకు అంత మొత్తం ఇస్తారని చెప్పను. అయితే ఏవరేజ్‌గా సినిమా కోసం రోజుకు అంత తీసుకుంటాను. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.
తమిళ సినిమా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మరో హీరో. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఇక్కడా దర్శకుడు. అయితే పవన్ చెప్పిన లెక్క ఈ సినిమాకే. ఆ తర్వాత చేయబోయే సినిమాలకు ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాడని టాక్.