టాలీవుడ్‌లో ‘పుష్ప’ ఎంత సందడి చేశాడో, అందులో ‘ఉ అంటావా..’ అంటూ సమంత కూడా అంతే సందడి చేసింది. వీరిద్దరి తోపాటు ఆ పాట పాడిన ఇంద్రావతి చౌహాన్ కూడా అంతే అలరించింది. హస్కీ వాయిస్‌తో ఇంద్రావతి పాడిన పాటకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ పాట వచ్చాక… అందరూ ‘ఉ అంటావా ఊఊ అంటావా’ అంటూ ఊగిపోతున్నారు. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది ఇంద్రావతి. మరి ఆమెకు ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా?
ఇంద్రావతి చౌహాన్… ఎవరో కాదు. మాస్ పాటల మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ సోదరి. నిజానికి ఈ పాటకు ముందే ఇంద్రావతి టీవీ ప్రేక్షకులకు తెలుసు. జానపద గేయాలతో ఎనిమిదేళ్ల క్రితమే టీవీల్లో అలరించింది ఇంద్రావతి. ఆ తర్వాత అడపదాదడపా కొన్ని ఈవెంట్లలో పాటలు పాడింది. సినిమా అవకాశం మాత్రం ఇదే తొలిసారి. ఇటీవల ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాట పాడటానికి వచ్చిన ఇంద్రావతి ‘పుష్ప’ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని వెల్లడించింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘పుష్ప’లో ఇంద్రావతికి అవకాశం గూగుల్ తెచ్చిపెట్టింది. అవును గూగుల్‌లో ఇంద్రావతి ఫొటోను చూసి సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ఆమెకు ‘ఉ అంటావా…’ అవకాశం ఇచ్చారట. ‘పుష్ప’లో ‘ఉ అంటావా..’ పాటను ఎవరితో పాడిద్దాం అని సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ఆలోచించుకున్నారట. దీంతో జానపద గీతాలు బాగా పాడేవారు ఎవరా అనుకుంటూ గూగుల్‌లో సెర్చ్ చేశారట. ఆ సమయంలో ఇంద్రావతి ఫొటో కనిపించిందట. ఆమె మంగ్లీ సోదరి అని తెలసుకొని… ఆమెనే అడిగారట.
మీ చెల్లెలు పాట పాడుతుందా అని మంగ్లీని ఆరాతీశారట. అలా ఇంద్రావతి చెన్నై వెళ్లి పాట పాడింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆమె మారుమోగిపోతోంది. ఎప్పుడో 2014లో చేసిన టీవీ కార్యక్రమం తనకు ఇప్పుడు అవకాశం తీసుకురావడం పెద్ద విషయమే కదా అంటూ ఆనందపడిపోతోంది ఇంద్రావతి. ఇక హెడ్డింగ్‌లో ఇంద్ర అన్నారేంటి అనుకుంటున్నారా? ఇంద్రావతి బాగా తెలిసిన వాళ్లు ఆమెను ఇంద్ర అని పిలుస్తారు లెండి.