‘టైగర్ నాగేశ్వరావు’ జీవితం ఆధారంగా తెలుగులో సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ సినిమా ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాలనుకున్నారు. దర్శకుడు వంశీ కథను సిద్ధం చేసుకున్న వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ కి వినిపించారు. ఆయన నచ్చడంతో ఓకే చెప్పారు. దీంతో నిర్మాత అభిషేక్ అడ్వాన్స్ గా రెండు కోట్ల రూపాయలను బెల్లంకొండకు ఇచ్చారు.
అయితే వేరే సినిమాలతో బిజీగా ఉన్నానని.. బెల్లంకొండ కొంతకాలం పాటు ఈ సినిమాను హోల్డ్ లో పెట్టారు. కొన్ని నెలల పాటు ఎదురుచూసిన దర్శకనిర్మాతలు ఇక లాభం లేదనుకొని రవితేజకి కథ చెప్పి ఒప్పించారు. దీంతో బెల్లంకొండకి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వమని కోరారు అభిషేక్ అగర్వాల్. దానికి బెల్లంకొండ ఇప్పుడు సినిమా చేద్దాం రండి అన్నారట. కానీ అప్పటికే రవితేజతో డీల్ చేసుకోవడంతో అదే విషయాన్ని బెల్లంకొండకి చెప్పారట. తనతో చేయాల్సిన సినిమా మరొక హీరోకి వెళ్లడంతో బెల్లంకొండ హర్ట్ అయ్యారట.
దీంతో అడ్వాన్స్ ఇవ్వనని అన్నారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు బెల్లంకొండ. ఆ విధంగా రవితేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటారని భావించారు. కానీ అలా జరగలేదు. ఫైనల్ గా బెల్లంకొండ ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవాల్సి వచ్చింది.