వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. సీనియర్ నటి జమున, ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం, నందమూరి తారక రత్న దూరమయ్యారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్, సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు, సీనియర్ నటి బేలా బోస్, మలయాళ నటి సిబి సురేష్ మరణించారు.. ఆదివారం (ఫిబ్రవరి 26) కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ మృతి చెందారనే వార్త మర్చిపోకముందే మరో యువ దర్శకుడు ఇకలేరని తెలియడంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..
వివరాల్లోకి వెళ్తే.. జోసెఫ్ మను జేమ్స్ అనే మలయాళ డైరెక్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు.. ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలు.. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న జోసెఫ్‌ను కేరళలోని ఎర్నాకుళంలో అలువాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.. జోసెఫ్ మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. జోసెఫ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న తొలి సినిమా ‘నాన్సీ రాణి’ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం.. ‘నాన్సీ రాణి’ లో అహనా కృష్ణ, ధ్రువన్, అజు వర్గీస్, లాల్ నటించారు..
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.. ఈ సమయంలో జోసెఫ్ చనిపోవడంతో ‘నాన్సీ రాణి’ మూవీ టీం శోక సంద్రంలో మునిగిపోయింది.. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో విడుదలైన ‘ఐ యామ్ క్యూరియస్’ అనే చిత్రం ద్వారా జోసెఫ్ బాలనటుడిగా మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు.. ఆయనకు భార్య నైనా మను జేమ్స్ ఉన్నారు.. కాగా జోసెఫ్ అంత్యక్రియలు ఆదివారం (ఫిబ్రవరి 26) మధ్యాహ్నం కుటుంబ సభ్యులు నిర్వహించారు.. మలయాళ పరిశ్రమ వర్గాల వారు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు..