సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ మధ్యనే దిల్ రాజు తండ్రి, నాజర్ తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. నిత్యం ఎవరొకరు పలు కారణాల వల్ల మృత్యువాత చెందుతున్నారు. బాలీవుడ్ నటి భైరవి మరణ వార్త ఈరోజు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు స్పష్టమైంది. ఆ బ్యాడ్ న్యూస్ విని సరిగ్గా 24 గంటలు ముగియకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అవును మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మలయాళంలో బడా నిర్మాతగా , మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ గా పేరొందిన పి.వి. గంగాధరన్ ఈరోజు అనగా అక్టోబర్ 13 ఉదయం కోజికోడ్‌లో మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యల వల్ల అనారోగ్యంపాలై ఆయన కొన్నాళ్లుగా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారట. పివిజి గా పిలవబడే శ్రీ గంగాధరన్ సినిమా, రాజకీయ రంగాలలో తన సత్తా చాటారు.
గృహలక్ష్మి ప్రొడక్షన్స్ ద్వారా ఆయన మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. 1977 లో ‘సుజాత’ అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన ఆయన ‘అంగడి’, ‘అహింస’, ‘చిరియో చిరి’, ‘కట్టాతే కిలిక్కోడు’, ‘వార్త’, ‘అద్వైతం’, ‘ఏకలవ్యం’ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. ‘సంతం’ చిత్రానికి గాను నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక (P. V. Gangadharan ) పి.వి. గంగాధరన్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.